కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:13 AM
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చీలికలు, నేతల రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు...
సోనియాగాంధీ ప్రతిపాదన.. సమయం కోరిన మమత.. పార్టీలో కీలక పోస్టుల ఆఫర్
న్యూఢిల్లీ, జూన్ 10: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చీలికలు, నేతల రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్టు సమాచారం. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయి, బీజేపీ పాలన ప్రారంభమైన దరిమిలా.. టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బీజేపీ నుంచి ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే పరిష్కారమని సోనియా సూచించినట్టు తెలిసింది. మరోవైపు, అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నేత రాహుల్‌తో భేటీ అయ్యారు.
భవిష్యత్తుపై బెంగ..
టీఎంసీ అగ్రనేతలుగా ఉన్న వారు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేయడంతో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని ప్రకటించారు. దీంతో పార్టీ భవితవ్యంపై మమత తల్లడిల్లుతున్నారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు సాగాలన్నది మరింత ఇబ్బందికరంగా మారింది. 64 మంది ఎమ్మెల్యేలు.. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో చీలిపోగా, 28 మంది ఎంపీల్లో 20 మంది కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో విడిపోయి.. ఎన్డీయేకు మద్దతిస్తామని, తమను ప్రత్యేక సమూహంగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖరాశారు. ఈ పరిణామాలతో టీఎంసీ పార్టీ మమత చేతుల్లోంచి జారీపోయే ప్రమాదం ఏర్పడింది. చీలిక వర్గాలకు ‘గుర్తింపు’ లభిస్తే.. పార్టీ గుర్తు, జెండా సహా టీఎంసీ ఆస్తులపైనా హక్కులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలుసుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బుధవారం కూడా మరోసారి ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే సోనియాగాంధీ.. విలీన ప్రతిపాదనను మమత ముందు ఉంచారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. తృణమూల్‌పై బీజేపీ ఒత్తిడి పెరుగుతుండడం పట్ల సోనియా ఆందోళన వ్యక్తం చేశారని, కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా బలమైన ప్రతిపక్షంగా బీజేపీని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని ఆమె సూచించారని పేర్కొన్నాయి. టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే, మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవితోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి పదవులు ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చినట్టు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై తక్షణమే నిర్ణయం తీసుకోలేనని, కొన్ని రోజుల సమయం కావాలని మమత కోరినట్టు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
అక్రమార్కుల విలీనమా?
టీఎంసీ విలీన ప్రతిపాదన వార్తలపై బెంగాల్ కాంగ్రెస్ విభాగం సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అక్రమార్కులు, అన్యాయాలు చేసిన పార్టీని కాంగ్రెస్‌లో ఎలా కలుపుకొంటారని నిలదీస్తున్నారు. అధికారికంగా దీనిపై ప్రకటన వచ్చాక తమ నిర్ణయం వెల్లడిస్తామని కొందరు నేతలు తెలిపారు. ఇదిలావుంటే, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు.. గురువారం బెంగాల్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ కానున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ స్పందిస్తూ.. ‘‘నాలుగు గోడల మధ్య వారు ఏం చర్చించారో తెలియదు. కాబట్టి, ఈ వ్యవహారంపై నేనేమీ వ్యాఖ్యానించను. కానీ, మమత తిరిగి వస్తానంటే కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరిస్తారా.. అనేది చూడాలి.’’ అని అన్నారు.
28 ఏళ్ల తర్వాత సొంత గూటికి!
టీఎంసీని విలీనం చేయాలన్న సోనియా ప్రతిపాదనకు మమతా బెనర్జీ అంగీకరిస్తే.. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఆమె తన సొంత గూటికి చేరినట్టు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన మమత.. 28 ఏళ్ల కిందట 1998లో కాంగ్రె్‌సతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా మూడు సార్లు బెంగాల్ ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చారు.
విలీనం కుదరదు: రితబ్రత బెనర్జీ
టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం కుదరదని తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ వ్యాఖ్యానించారు. తనకు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీరు నచ్చనివారే..తన వెంట వచ్చారని, ఇప్పుడు పార్టీతో కలిసి కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు వారెవరూ సిద్ధంగా లేరని అన్నారు. తమను లెజిస్టేటివ్ పార్టీగా గుర్తించాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ ఇవ్వనున్నట్టు చెప్పారు. టీఎంసీ ఎంపీలది కూడా ఇదే మాట అని ఆయన పేర్కొన్నారు. ఇక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన రిజు దత్తా విలీన ప్రతిపాదనపై మరింత తీవ్రంగా స్పందించారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు 80కి 64 మంది ఉన్నారు. ఎంపీలు 20కి 15 మంది ఉన్నారు. ఇక, ఎవరు ఎవరిలో విలీనం అవుతారు?.’’అని ఆయన ప్రశ్నించారు.