పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:03 PM
జమ్ముకశ్మీర్‌లో ఏకకాలంలో భిన్న వాస్తవాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎల్ఓసీకి అవతలి ప్రాంతం నిరసనలు, ఉద్రిక్తతలతో అట్టుడుకుతుండగా.. ఇవతలి ప్రాంతంలో మాత్రం జోజిలా టన్నెల్ పూర్తికావడంతో సందడి వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖతో విడిపోయిన రెండు కశ్మీర్‌ల గాథను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ ప్రాంతాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్‌ఓసీ)కి ఇరువైపులా ఒకే సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు భిన్న వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. ఓవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో నిరసనలు, ఉద్రిక్తతలు, భద్రతా బలగాల కాల్పులతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో జోజిలా సొరంగం నిర్మాణంలో కీలక మైలురాయి సాధించడంతో అభివృద్ధి సంబరాలు కనిపిస్తున్నాయి.
పీఓకేలో ఉద్రిక్తతలు..
రావలకోట్, ముజఫరాబాద్, మీర్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఇటీవల నిరసనలు ఉద్ధృతమయ్యాయి. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరకుల ధరలు, ద్రవ్యోల్బణం, పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలను అణిచివేసేందుకు పాకిస్థాన్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. దీంతో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సహా వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మృతిచెందినట్టు, సుమారు 200 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి.
జోజిలా సంబరాలు..
ఇక.. జమ్ముకశ్మీర్‌లోని సోనమార్గ్, బాల్తాల్, మినామార్గ్ ప్రాంతాల్లో జోజిలా సొరంగ నిర్మాణం కీలక దశను చేరుకుంది. కశ్మీర్, లద్దాఖ్ వైపుల నుంచి తవ్విన మార్గాలు కలవడంతో ఇంజినీర్లు, కార్మికులు విజయోత్సాహం నిర్వహించారు. సుమారు 13.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ టన్నెల్.. ఆసియాలోనే అత్యంత పొడవైన ద్విముఖ రహదారి సొరంగాల్లో ఒకటి. సముద్రమట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా కశ్మీర్-లద్దాఖ్ మధ్య అనుసంధానానికి సాధ్యం కానుంది. ప్రస్తుతం.. శీతాకాలంలో భారీ మంచు కారణంగా జోజిలా కొన్ని నెలలపాటు మూతపడుతుంది. కానీ టన్నెల్ అందుబాటులోకి రానుండటంతో లద్దాఖ్‌కు నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది.
2019లో ఆర్టికల్ 370 రద్దైనప్పటి నుంచి.. కశ్మీర్‌లో రహదారులు, సొరంగాలు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. జెడ్-మోర్హ్ సొరంగం, చెనాబ్ రైల్వే వంతెన, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే మార్గం, జోజిలా సొరంగం వంటి ప్రాజెక్టులు ప్రాంతీయ అనుసంధానానికి బలం చేకూరుస్తున్నాయి. వందే భారత్ రైళ్లు కశ్మీర్ లోయలో పరుగులు తీయడం, పర్యాటక రంగం విస్తరించడం, కొత్త పెట్టుబడులు రావడం స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తున్నాయి.
పీఓకేలో ఆర్థిక సమస్యలు, రాజకీయ అసంతృప్తి, పరిపాలనా వివాదాలు తరచూ ఆందోళనలకు దారితీస్తుండగా.. కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటక రంగం విస్తరణ ప్రధాన చర్చనీయాంశాలుగా నిలుస్తున్నాయి. జూన్ 9న చోటుచేసుకున్న ఈ రెండు సంఘటనలు ఎల్‌ఓసీకి ఇరువైపులా కశ్మీర్ ప్రాంతాల్లో నెలకొన్న భిన్న పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
ఇవీ చదవండి:
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ఇప్పట్లో లేనట్టేనా.. మస్క్ బృందం స్పందన ఏంటంటే..
మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?