Share News

హెడ్‌ఫోన్సా.. ఇయర్‌బడ్సా? చెవులకు ఏది మేలు.!

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:58 PM

నేటి కాలంలో మ్యూజిక్ నుంచి ఆన్‌లైన్ మీటింగ్స్ వరకు హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే వీటిలో ఏది మంచిదనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది. అదేదో తెలుసుకుందాం...

హెడ్‌ఫోన్సా.. ఇయర్‌బడ్సా? చెవులకు ఏది మేలు.!

ఇంటర్నెట్ డెస్క్: ఖాళీగా ఉన్నా, జర్నీ చేయాల్సి వచ్చినా లేదా ఆన్‌లైన్ సమావేశాలకు హాజరవ్వాలన్నా దాదాపుగా చాలామంది హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్‌ను వాడేస్తున్నారు. కానీ మనం ఎంతగానో ఇష్టపడే ఈ పరికరాలు మన వినికిడి శక్తిని ఎంతమేర ప్రభావితం చేస్తాయో మీరెప్పుడైనా ఆలోచించారా? హెడ్‌ఫోన్స్ అయినా, ఇయర్‌బడ్స్ అయినా.. సక్రమంగా వాడితేనే వాటివల్ల ఎదురయ్యే దుష్ప్రభవాల నుంచి బయటపడవచ్చు. వీటి ఉపయోగంలో ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించినా.. అవి వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇయర్‌బడ్స్:

ఇయర్‌బడ్స్ నేరుగా చెవుల్లో అమరిపోతాయి. దీంతో శబ్ద తరంగాలు.. చెవిపొరకు చాలా దగ్గరై ప్రభావం చూపుతాయి. ఎక్కువ సమయం, అధిక శబ్దంతో వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం, చెవుల్లో చికాకుగా అనిపించడం(టిన్నిటస్), అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు వంటివి సమస్యలు తలెత్తే అవకాశముంది. అలాగే బయటి శబ్దాలు వినిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది తెలియకుండానే వాల్యూమ్‌ను పెంచేస్తుంటారు. ఇది చెవులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి నియంత్రిత వాల్యూమ్‌ను దాటకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.

హెడ్‌ఫోన్స్:

ఓవర్‌-ఇయర్ హెడ్‌ఫోన్స్.. చెవులకు బయటి భాగంలో ఉంటాయి. ఇవి చెవిపొరకు కొంత దూరంలో ఉండటంతో శబ్ద ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండటంతో చుట్టూ ఎక్కువ శబ్దం ఉన్నా వాల్యూమ్‌ను అధికంగా పెట్టాల్సిన అవసరం అంతగా ఉండదు. కాబట్టి ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే హెడ్‌ఫోన్స్ కొంత వరకు సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు.


ఏ పరికరమైనా అధిక శబ్దంతో, ఎక్కువసేపు వినియోగిస్తే వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవి లోపలి భాగంలోని సూక్ష్మ కేశ కణాలు దెబ్బతింటే అవి మళ్లీ ఏర్పడవు. అందుకే శబ్ద స్థాయిని నియంత్రించడం అత్యంత అవసరం. వినికిడి సమస్యలు ఒక్కసారిగా కాకుండా క్రమంగా ప్రభావం చూపుతాయి. మాట్లాడే సమయంలో ఇబ్బందులు, చెవుల్లో చికాకు లేదా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించే వరకు చాలామందికి ఈ సమస్య ఉన్న విషయం తెలియదు.

60/60 రూల్: వినికిడిని కాపాడుకునేందుకు నిపుణులు 60/60 నియమాన్ని సూచిస్తున్నారు.

  • గరిష్ఠ శబ్ద స్థాయిలో 60 శాతానికి మించి వాల్యూమ్ పెట్టుకోకూడదు.

  • ఒకేసారి 60 నిమిషాలకు మించి వినకూడదు.

  • ప్రతి సెషన్ మధ్యలో విరామం తీసుకోవాలి.

  • చెవులకు విశ్రాంతి కల్పించడం ద్వారా శబ్ద ప్రభావాన్ని తగ్గించవచ్చు.

చివరగా.. హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌లలో ఏది ఉపయోగించినా శబ్ద స్థాయిని నియంత్రించడం, మధ్య మధ్యలో విరామం తీసుకోవడం, చెవులకు విశ్రాంతి కల్పించడం చాలా ముఖ్యం. వినికిడి సమస్యలు వృద్ధాప్యంలోనే వస్తాయని భావించడం పొరపాటు. చిన్న వయసులో అలవాటైన వినికిడి పద్ధతులే భవిష్యత్తులో చెవుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.


ఇవీ చదవండి:

భయం వేసినప్పుడు చేతులు, కాళ్లు ఎందుకు వణుకుతాయో తెలుసా?

గ్యాస్, ఉబ్బరానికి ఆహారం మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా కారణమే!

Updated Date - Jun 07 , 2026 | 03:02 PM