Share News

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

ABN , Publish Date - Jun 10 , 2026 | 10:59 AM

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్​​​​​‌కు అవకాశం కల్పించింది.

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్​​​​​‌కు అవకాశం కల్పించిన బీజేపీ.. ఏకగ్రీవంగా విజయం సాధించి మూడు రాజ్యసభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయడం దాదాపు ఖాయమైంది. మరో ఇద్దరు అభ్యర్థులైన తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్‌ల ఎన్నికను ఖరారు చేసేందుకు ఆ పార్టీకి శాసనసభలో తగినంత మద్దతు ఉంది. దీంతో రాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ సంపూర్ణ విజయాన్ని కైవసం చేసుకోనుంది.


ఈ నేపథ్యంలో మహేశ్ కేవత్‌ రాజకీయ నేపథ్యం ఏమిటో ఓసారి పరిశీలిస్తే.. ఆయనో సీనియర్ బీజేపీ నేత. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)తో పాటు బీజేపీ సంస్థాగత నెట్‌వర్క్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉన్న కేవత్.. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), బీజేపీ యువజన విభాగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా మంత్రిగానే కాకుండా సంఘ్ పరివార్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేశారాయన. అంతేకాకుండా.. రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గానూ సేవలందించారు. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్, కేవత్ సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. హిందూ పురాణాలలో పూజ్య పురుషుడైన నిషాద్ రాజ్ వారసత్వ కొనసాగింపునకు ఆయన నామినేషన్ నిదర్శనమని పేర్కొన్నారు.


మీనాక్షి నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారంటే?

నటరాజన్ నామినేషన్ పత్రాలలో అనేక లోపాలున్నాయని, కొన్ని వివరాలను ఆమె దాచిపెట్టారని బీజేపీ ఆరోపించింది. తెలంగాణలోని ఓ కోర్టులో ఆమెపై ఉన్న పెండింగ్‌ కేసు విషయాన్ని వెల్లడించలేదనేది ఆ పార్టీ లేవనెత్తిన కీలక అభ్యంతరాలలో ఒకటి. పరిశీలన ప్రక్రియలో ఎన్నికల అధికారులు అభ్యంతరాలను స్వీకరించడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ పోటీలో కాంగ్రెస్ సవాలుకు దాదాపుగా తెరపడినట్టు సమాచారం.


ఇవీ చదవండి:

దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత..

జైలు నుంచి రాగానే వరుస హత్యలా!

Updated Date - Jun 10 , 2026 | 11:23 AM