మంచుకొండల్లో మానవ నిర్మిత అద్భుతం
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:17 AM
శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్-1) ఉంది. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో....
ఆసియాలోనే అతిపెద్ద బై డైరెక్షనల్ టన్నెల్ జోజిలా సొరంగం
కీలకఘట్టమైన ‘ఫైనల్ బ్రేక్ త్రూ’ను పూర్తిచేసిన మేఘా సంస్థ
శ్రీనగర్-లద్దాఖ్ మధ్య ఏడాది పొడుగునా ప్రయాణానికి చాన్స్
మంచుకొండల్లో మానవ నిర్మిత మహాద్భుతం.. జోజిలా టన్నెల్‌కు సంబంధించి అత్యంత కీలక ఘట్టమైన ‘ఫైనల్ బ్రేక్ త్రూ’ (ఇరువైపులా తొలచిన సొరంగాన్ని అనుసంధానించే చివరి ఘట్టం) మంగళవారం విజయవంతంగా పూర్తయింది.
మంచు కారణంగా ఏడాదిలో ఆర్నెల్లపాటు మూసి ఉండే సోనామార్గ్ - లద్దాఖ్ మధ్య.. 365 రోజులూ రాకపోకలకు వీలు కల్పించేలా మన తెలుగువారికి చెందిన మేఘా సంస్థ నిర్మించిన ఈ టన్నెల్‌పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
(శ్రీనగర్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్-1) ఉంది. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో 12 నుంచి 14 గంటల దాకా ప్రయాణించాల్సి ఉంది. మరీ ముఖ్యంగా ఈ దారిలో సోనమార్గ్ దగ్గరున్న బాల్తాల్ నుంచి లద్దాక్‌లోని కార్గిల్ జిల్లా మీనామార్గ్‌కు 40 కిలోమీటర్లే దూరం. కానీ ఆ దారిలో ప్రయాణానికి దాదాపు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. మంచు కారణంగా ఈ రహదారి ఏడాదిలో సగం రోజులు మూతబడిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతుంటారు. లద్దాఖ్, లేహ్ ప్రాంతాలకు వెళ్లే వీలు లేక.. పర్యాటకంపైనా ప్రభావం పడే పరిస్థితి. అంతేనా.. దేశ రక్షణలో కీలకమైన కార్గిల్-జోజిలా-ద్రాస్ ప్రాంతాలకు ఏడాది పొడవునా వెళ్లలేని దుస్థితి. ఈ నేపథ్యంలోనే.. శ్రీనగర్‌లోని సోనామార్గ్ దగ్గరున్న బాల్తాల్ నుంచి ద్రాస్ జిల్లా పరిధిలోని ‘జోజిలాపాస్’ ప్రాంతం వరకూ సుమారు 13.15 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను(సొరంగ మార్గాన్ని) నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.6,808 కోట్లతో ఈ టన్నెల్‌ను నిర్మించే పనులను ‘మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ సంస్థ దక్కించుకుంది. 2020 అక్టోబరు 1న మొదటిదశ పనులు ప్రారంభించి సొరంగం నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇంకా.. అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, సీసీ కెమెరాలు సహా మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అవి మరో ఏడాదిలో పూర్తవనున్నాయి. సోనామార్గ్ సమీపంలోని బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్-కార్గిల్ ప్రాంతంలోని మీనమార్గ్ తూర్పు పోర్టల్ వరకు విస్తరించిన జోజిలా టన్నెల్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతాలతో పాటు శ్రీనగర్- లద్దాక్ మధ్య 365 రోజులూ నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ టన్నెల్.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బై-డైరెక్షనల్ టన్నెల్. ఈ సొరంగం పూర్తిగా వినియోగంలోకి వస్తే బాల్తాల్ నుంచి మీనామార్గ్‌కు 27 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా నాలుగు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. అంతేకాదు.. వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా సులభం అవుతుంది.


స్పెయిన్ సాఫ్ట్‌వేర్ సాయంతో..
టన్నెల్ నిర్మాణం కోసం స్పెయిన్ దేశానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్‌లో సొరంగాన్ని తవ్వారు. అయితే ఆ ప్రాంతంలో నిత్యం మంచు కురవడం, వణికించే చలిగాలులు, వానల కారణంగా.. భూమి కొన్నిచోట్ల మెత్తగా, కొన్నిచోట్ల గట్టిగా ఉండేది. భూమి స్వభావం ఇట్టే మారిపోయేది. ఎంతలా అంటే.. 13కిలోమీటర్ల టన్నెల్ తవ్వే క్రమంలో భూమి స్వభావం దాదాపు 67సార్లు మారింది. ఒకచోట బలమైన రాతి నిర్మాణం ఉంటే, మరోచోట బలహీనమైన భూభాగం. ఆ సమయంలో తవ్వడానికి తీవ్రమైన ఇబ్బందులు ఉండేవని సంస్థ ఇంజినీర్లు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెయిన్ నుంచి ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తెప్పించారు. దాని సాయంతో అవసరమైన మేరకు బ్లాస్టింగ్స్ చేపట్టారు. వేసవి సమయంలోనూ అక్కడ తీవ్రమైన చలి అక్కడ ఉంటుంది. టన్నెల్ తవ్వే సమయంలో రెండుసార్లు భారీ మంచుతుఫానులు రావడంతో కొంతమంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి.. తుఫాను ఆగిపోయి, మంచు తీవ్రత తగ్గాక మళ్లీ పనులు చేపట్టారు. దాదాపు 1200 మంది కార్మికులు ఈ అతి తీవ్ర వాతావరణాన్ని ఎదుర్కొంటూ.. ఎంతో శ్రమించి టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిచేశారు.
టన్నెల్ ఫైనల్ బ్రేక్ త్రూను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ
దేశ మౌలిక వసతుల చర్రితలో జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. ఇది కేవలం రహదారి మాత్రమే కాదని లద్దాక్-జమ్ము కశ్మీర్ ప్రాంతాలకు జీవనరేఖలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీనగర్- లద్దాక్ ప్రాంతాలను కలిపే 13.5 కిలోమీటర్ల జోజిలా టన్నెల్ ఫైనల్ బ్రేక్ త్రూను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. 2014లోనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ.. పలుమార్లు టెండర్ల దశలోనే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. చివరికి ‘మేఘా’ సంస్థ చొరవ, కార్మికుల కృషితో అంచనా వ్యయంకన్నా తక్కువకే ప్రాజెక్టు పూర్తవ్వడం ఆనందంగా ఉందన్నారు. జోజిలా టన్నెల్ నిర్మాణంతో పర్యాటక, వాణిజ్య, రక్షణ రంగాలు బలపడతాయన్నారు. అలాగే కశ్మీర్-లద్దాఖ్ మధ్య నిరంతరాయ ప్రయాణాలకు అవకాశం ఉందన్నారు. రూ.1000 కోట్లతో 48 కిలోమీటర్ల మేర లేహ్ దక్షిణ బైపా్‌సను, అలాగే రూ.200 కోట్లతో 7.6కి.మీ ఉత్తర బైపాస్‌ను చేపడతామని గడ్కరీ ప్రకటించారు.
ప్రాజెక్టు విశేషాలు..
ప్రాజెక్ట్ మొత్తం పొడవు రోడ్లు, వంతెనలతో కలిపి 30.894 కి.మీ. ఇందులో జోజిలా ప్రధాన టన్నెల్ పొడవు 13.153 కిలోమీటర్లు. నిల్‌గ్రార్ టన్నెల్‌లోని టీ1 పొడవు 457.35 మీటర్లుండగా, టీ2 పొడవు 1,953.63 మీటర్లు.
ఈ ప్రాజెక్టులో ఉన్న మూడు వంతెనల పొడవు 460 మీటర్లు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వెర్టికల్ షాఫ్ట్ ఇక్కడ నిర్మించారు. వెర్టికల్ షాఫ్ట్-1 (పశ్చిమ) పొడవు 474.30 మీటర్లు. దీని ఎత్తు 3481 మీటర్లు. మధ్యలో నిర్మించిన వెర్టికల్ షాఫ్ట్-2 పొడవు 367.38 మీటర్లు. తూర్పు వైపున నిర్మించిన వెర్టికల్ షాఫ్ట్-3 పొడవు 213.50 మీటర్లు. మొత్తం 2,350 మీటర్ల క ట్-అండ్-కవర్ నిర్మాణాలు ఈ ప్రాజెక్ట్‌లో ఏడు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో 450 మీటర్ల స్నో గ్యాలరీ కూడా ఉంది.
జోజిలా టన్నెల్‌లో దాదాపు 17 ఎమర్జన్సీ ‘లే బైస్’ ఉంటాయి.
80కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు.
ఆటోమాటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు.
అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను ఈ మార్గంలో అమర్చనున్నారు.
అత్యవసర టెలిఫోన్ సిస్టమ్ కూడా ఈ టన్నెల్‌లో అందుబాటులో ఉండనుంది.