జైలు నుంచి రాగానే వరుస హత్యలా!
ABN , Publish Date - Jun 10 , 2026 | 06:12 AM
జైలు నుంచి విడుదలైన వెంటనే విచక్షణ కోల్పోయి వరుస హత్యలకు పాల్పడే క్రూరత్వాన్ని ‘బైపోలార్ డిజార్డర్’ (మానసిక జబ్బు) సాకుతో సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
‘బైపోలార్ డిజార్డర్’ సాకుతో తప్పించుకోలేరు
‘కిల్లింగ్ స్ర్పీ’ని అంత తేలికగా తీసుకోలేం
ఉన్మాది ఆనంద్‌కుమార్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జైలు నుంచి విడుదలైన వెంటనే విచక్షణ కోల్పోయి వరుస హత్యలకు పాల్పడే క్రూరత్వాన్ని ‘బైపోలార్ డిజార్డర్’ (మానసిక జబ్బు) సాకుతో సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ముగ్గురిని ఒకేసారి కిరాతకంగా హత్య చేసిన ఉన్మాది ఆనంద్ కుమార్ కేసు విచారణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుడిలో ఉన్మాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘కిల్లింగ్ స్ర్పీ’ (వరుస హత్యల పరంపర)ను తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏడిద ఆనంద్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది.
అంత తేలికగా తీసుకోలేం..
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆనంద్‌కుమార్ బుద్ధిపూర్వకంగా హత్యలు చేశాడా? మానసిక జబ్బు వల్ల చేశాడా? అనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. అతని శిక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ ‘అతను ఒక హత్య చేసి జైలుకు వెళ్లాడు. బయటకు రాగానే మరో ముగ్గురిని హత్య చేసి ఉన్మాదానికి పాల్పడ్డారు. ఇలాంటి కేసుల్లో మనమూ అంతే కఠినంగా ఉండాలి. జాలికి అవకాశమే లేదు’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు మానసిక జబ్బు ఉన్నట్లు మీరు ఆధారాలతో నిరూపించలేకపోయారని పేర్కొంది. ముగ్గురిని హత్య చేసినప్పుడు అతను ఎలాంటి చికిత్సలో లేడని వ్యాఖ్యానించింది. వాస్తవాలు తీవ్రంగా ఉన్నాయని, కోర్టులో వాదనలు వినిపిస్తున్నంత సాధారణంగా అక్కడి పరిస్థితి లేదని అర్థమవుతోందని తేల్చిచెప్పింది.
అసలు ఏం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ 2004లో జరిగిన ఓ హత్య కేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలయ్యాడు. ముద్దాయి చిన్నతనంలోనే అతని ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు అనారోగ్యంతో చనిపోయారు. ఏడిద విజయ లలిత (వదిన), పొరుగువారైన గెడ్డం నాగభూషణం, ఖండవల్లి కుమారిలు చేసిన చేతబడి వల్లే వారు చనిపోయారని ముద్దాయి మనసులో అతని తల్లి నూరిపోసింది. దీంతో ఆనంద్ వారిపై పగ పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చాక వదిన తనను సరిగా చూసుకోవడం లేదని, తన నేర చరిత్ర గురించి ఊరంతా ప్రచారం చేయడం వల్లే తనకు పెళ్లి కావడం లేదని అదనపు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2015 డిసెంబరు 24న ఇనుప పైపుతో తన అన్న కూతురిని కొట్టాడు. అడగడానికి వచ్చిన వదిన తలపై పైపుతో బాది హతమార్చాడు. కాపాడటానికి వచ్చిన ఇంటిపక్కనే ఉండే నాగభూషణంపైనా దాడి చేసి ప్రాణాలు తీశాడు. మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. పక్క వీధిలో ఉండే కుమారి తలపైనా పైపుతో బలంగా కొట్టాడు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసును విచారించిన జిల్లా అదనపు కోర్టు 2017లో ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. అయితే, తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని, చట్టప్రకారం శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆనంద్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన ధర్మాసనం.. ముద్దాయికి మానసిక దూకుడు ఉన్నప్పటికీ, తను ఏం చేస్తున్నాడనే పూర్తి స్పృహతో, ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు చేశాడనే విషయం వైద్య సాక్ష్యాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొంది. సాంకేతిక కారణాల వల్ల ఐపీసీ సెక్షన్ 397ను తొలగించినప్పటికీ.. హత్య (సెక్షన్ 302), దాడి (సెక్షన్ 324) కింద జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పునిచ్చింది. దీన్ని ఆనంద్ కుమార్ ఈ ఏడాది మే 25న సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.