Share News

మామిడి దిగుబడిపై ఆశలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:43 PM

మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.

మామిడి దిగుబడిపై ఆశలు

  • చెట్లకు విరగబూసిన పూత, కాత

  • జిల్లాలో 6,018 ఎకరాల్లో మామిడి తోటలు

  • గాలి దుమారాలు లేకుంటే లాభసాటి

నర్సంపేట(వరంగల్): మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా అకాల వర్షాలు, గాలిదుమారాలతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. జిల్లాలో 6,018 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో నర్సంపేట(Nursampet) డివిజన్‌లో 327.24 ఎకరాలు, వర్ధన్నపేట డివిజన్‌లో 2,594.27, రాయపర్తిలో 1,333 ఎకరాలు, పర్వతగిరిలో 1,311 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. మిగిలిన మండలాల్లో 4 నుంచి 327 ఎకరాల వరకు ఈ తోటలున్నాయి.


అతివృష్టి, అనావృష్టితో రెండు, మూడేళ్లుగా పూతకాత లేక, కాసిన కొద్దిపాటి మామిడికాయలు గాలిదుమారాలకు నేలరాలి నష్టాల బారిన పడిన రైతులకు ఈ ఏడాదైనా కాలం కరుణిస్తుందని ఆశిస్తున్నారు. మార్కెట్‌లో వివిధ రకాల పండ్లు లభిస్తున్నా మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా వేసవిలో మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి సీజన్‌ కంటే ముందే మామిడి మార్కెట్‌లో దర్శనమివ్వనుంది. ఏ మామిడి తోటను చూసినా పూత కాత కనిపిస్తుంది.


గాలిదుమారాలు రాకుంటే ఆదాయం

ఏటా గాలిదుమారాలతో కూడిన వర్షాలు పడడంతో పూత రాలి పోయేది. గతేడాది నూటికి 75 శాతం రైతులు నష్టపోయారు. ఈ ఏడాది తోటల్లోని చెట్లకు పూత విరగ బూయడంతో పాటు కాత దశకు రావడంతో ఆదాయం వస్తుందన్న నమ్మకం రైతుల్లో చోటు చేసుకుంది.


zz.jpgమామిడి దిగుబడిపై ఆశలు

ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురియడం, చెట్లు కాత దశకు రావడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నారు. గాలిదుమారాలు రాకుంటే ఎకరం మామిడితోట ద్వారా 10 నుంచి 20 టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుంది. దిగుబడి ఆశించిన మేరకు వస్తే ఎకరంలోని మామిడితోటల ద్వారా పెట్టుబడులు పోను రూ. లక్ష నుంచి రూ.2 లక్షల ఆదాయం సమకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు.


zzz.jpg

సస్యరక్షణ చర్యలతో దిగుబడులు

- శంకర్‌, ఉద్యానవన అధికారి వరంగల్‌

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మామిడి చెట్లకు మంచి గా పూత పూసింది. కొన్ని తోటల్లో చెట్లకు పిందెలు వేశాయి. ఈ తోటలకు సాధారణంగా తామర, తేనె మంచు పురుగు వంటి తెగుళ్లు వ్యాపిస్తాయి. మామిడి తోటల్లోని చెట్లు పూత, కాత దశ వరకు చక్కటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరుగుతంది. తామర పురుగు నివారణకు నీలంరంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. వేపనూనె లీటరు నీటిలో 5ఎం.ఎల్‌ లేదా ఫి ఫ్రోనిల్‌ 2 మి.లీ. కలిపి మామిడి చెట్లకు పిచికారీ చేయాలి. తేనె మంచు పురుగు నివారణకు బు ఫ్రోఫెజిస్‌ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి కాచికారీ చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 01:43 PM