Share News

ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:13 PM

యుద్ధ పరిస్థితులను పలు విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ నుంచి లండన్, ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే విమానాల టికెట్ ధరలు భారీగా పెరిగాయి.

ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..
Hyderabad airfares surge

ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇండియానుంచి ఇతర దేశాలకు వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ఈ రోజు(మంగళవారం) బెంగళూరు కెంపెగౌడ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి 42 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సంబంధించి 80 సర్వీసులు రద్దయ్యాయి. కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 10 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన విమాన సర్వీసుల్లో యూఏఈ సర్వీసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.


ఆకాశాన్ని అంటుతున్న టికెట్ ధరలు..

యుద్ధ పరిస్థితులను పలు విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ నుంచి లండన్, ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే విమానాల టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ ధరల కంటే రెట్టింపు అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానాల టికెట్ ధరలు 65 వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి జర్మనీ వెళ్లే విమానాల టికెట్ ధరలు ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఏకంగా 200 శాతం నుంచి 300 శాతం పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.


అమెరికాకు వెళ్లే విమానాల టికెట్ ధరల పరిస్థితి కూడా అలానే ఉంది. హైదరాబాద్ నుంచి ఇథియోపియా మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానాల టికెట్ ధర 1.5 లక్షల రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ నుంచి యూఏఈ వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి ప్రతీ నిత్యం 5 వేల మంది దాకా ప్రయాణీకులు యూఏఈ వెళుతుంటారు. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండి

ముదురుతున్న ఎండలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై తీవ్ర ప్రభావం తప్పదా..?

Updated Date - Mar 03 , 2026 | 01:35 PM