టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:36 PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీమిండియాపై పరోక్షంగా అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ సెమీస్ కూడా చేరదంటూ ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ జోస్యం చెప్పి నవ్వుల పాలయ్యాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)లో అద్భుత విజయాలతో భారత్ సెమీస్‌కు చేరింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సూపర్-8 నుంచే ఇంటిదారి పట్టింది. తమ జట్టు ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక పోతున్న పాక్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీమిండియాపై పరోక్షంగా అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ సెమీస్ కూడా చేరదంటూ ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ జోస్యం చెప్పి.. నవ్వులపాలపైన సంగతి తెలిసిందే.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ సెమీ ఫైనల్‌కి చేరడంతో ఆమీర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే బుద్ధి మారని ఆమీర్.. మరోసారి భారత్ పై విషం చిమ్మాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్‌లో ఆమిర్ మాట్లాడుతూ..'క్రికెట్ విషయంలో నా విశ్లేషణ ప్రకారం భారత జట్టు మంచి క్రికెట్ ఆడటం లేదు. వారి ఫీల్డింగ్‌ను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వారు కనీసం 3 నుంచి 4 క్యాచ్‌లు వదిలివేశారు. అలానే టీమిండియా ప్లేయర్లు మైదానంలో తడబడ్డారు' అని ఆమిర్(Mohammad Amir) అన్నాడు.
'అలానే టీమిండియా(Team India) బౌలర్లలో బుమ్రా మినహా ప్రతి బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఆల్ రౌండర్ పాండ్యా పెద్ద జట్లపై ఎప్పుడూ రాణించలేదని నేను మీకు చెప్పాను. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. అతను తన 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. సెమీఫైనల్లో ఉన్న సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు స్పిన్నర్లపై బాగా ఆడతాయి. టీమిండియా ఒక్క బౌలర్ పైనే ఆధారపడి ఆడుతోంది. ఇప్పటికీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ కాదని నేను నమ్ముతున్నాను' అని ఆమిర్ ఎద్దేవా చేశాడు.
భారత జట్టు మార్చి 5న ముంబైలో ఇంగ్లండ్(England)తో సెమీఫైనల్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందో.. ఆమిర్ చేసిన విమర్శల్లో నిజం ఎంతుందో తేలిపోతుంది. ఒకవైపు పాక్ ప్లేయర్లకు పీసీబీ భారీ జరిమానాలు విధిస్తుంటే.. మరోవైపు ఆమీర్ వంటి వాళ్లు భారత్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.