Share News

హోలీ హంగామా!

ABN , Publish Date - Mar 03 , 2026 | 06:59 AM

హోలీ అనగానే హరివిల్లు వంటి రంగురంగుల గులాలు, డప్పు, డోల్‌ వాయిద్యాలు, రెయిన్‌ డ్యాన్స్‌లు, డీజే మోతలు వంటి వాటితో నగరం మోత మోగిపోతుంది.

హోలీ హంగామా!

  • డీజేల హవా.. భారీ స్థాయిలో ఈవెంట్లు..

  • పర్యావరణ హితంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: హోలీ అనగానే హరివిల్లు వంటి రంగురంగుల గులాలు, డప్పు, డోల్‌ వాయిద్యాలు, రెయిన్‌ డ్యాన్స్‌లు, డీజే మోతలు వంటి వాటితో నగరం మోత మోగిపోతుంది. అలాంటి పండుగ వస్తుందంటే యువతలో ఎనలేని ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఈవెంట్‌ మేనేజర్లు నగరంలో ఈసారి భారీగా హోలీ ఈవెంట్లు చేస్తున్నారు. ఓవైపు పర్యావరణ హితంగా జరిపేలా ఈవెంట్లను రూపొందిస్తున్నా మరోవైపు సెలబ్రెటీలతో యువతను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ వేడుకలపై ఎలాంటి ప్రభావమూ చూపదని పార్టీ ప్రియులు చెబుతున్నారు.


భారీ స్థాయిలో వేడుకలు

ఈసారి రెండు రోజుల (మంగళ, బుధవారాలు) పాటు నిర్వహించే హోలీ వేడుకల్లో 50కు పైగా ఈవెంట్లు జరగనున్నాయి. అయితే, 4వ తేదీనే ఎక్కువగా ఈవెంట్లు ఉండనున్నాయి. ఆ మేరకు ఈవెంట్‌ మేనేజర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్నివాల్‌ డ్యాన్సర్స్‌తో పాటుగా పుణె, పంజాబ్‌ల నుంచి ప్రత్యేకంగా ధోల్‌ కళాకారులను తీసుకువస్తున్నారు. మడ్‌పిట్‌లు, రెయిన్‌ డ్యాన్స్‌లు, సెలబ్రిటీ డీజేలు, బ్యాండ్‌లు తదితరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నెక్లెస్‌ రోడ్‌ మొదలు పెట్టి హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి సహా నగర నలుమూలాల ఈ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


city1.2.jpgపర్యావరణ హితం..

ఈసారి హోలీ వేడుకలు గతానికి భిన్నంగా పర్యావరణహితంగా జరగనున్నాయి. సాధారణంగా కనిపించే సింథటిక్‌ రంగులను దాదాపుగా అన్ని పార్టీలలోనూ దూరం పెట్టేశామని చెబుతున్నారు. ఈసారి పలు వేదికల వద్ద ప్రత్యేక నేపథ్యాలతో వేడుకను నిర్వహిస్తుండటం విశేషం. ఇదే విషయమై ఓ ఈవెంట్‌ మేనేజర్‌ చెబుతూ ‘జంగిల్‌ హోలీ మొదలు లాఠ్‌ మార్‌ హోలీ వరకూ నగరంలో ఈసారి వేడుకలు జరుగబోతున్నాయి. సంప్రదాయాన్ని స్ఫురించేలా రాధాకృష్ణ హోలీ అని ఒకరంటే, ధమాకా హోలీ అని మరొకరు పార్టీలకు శ్రీకారం చుట్టారు..’ అని తెలిపారు. వేడుక ఏదైనా రెయిన్‌డ్యాన్స్‌, డీజే కామన్‌గా ఉంటాయని, భంగ్‌ లాంటివి కొన్నిచోట్ల లభిస్తే ఫుడ్‌ మాత్రం దాదాపు అన్ని ఈవెంట్లలోనూ ఉంటుందన్నారు.


సెలబ్రిటీల సందడి

గత కొన్నేళ్లుగా నగరంలో జరిగే ఈవెంట్లలో సింథటిక్‌ రంగుల వినియోగం తగ్గింది. అదే సమయంలో ఈసారి సెలబ్రిటీల సందడి పెరిగింది. అనన్య నాగళ్ల, మంగ్లీ, తేజుప్రియ, అనసూయ, రోల్‌ రైడా లాంటి వారు ఈ వేడుకల్లో భాగం కానుండటంతో మరింత సందడిగా ఉంటుందని ఆశిద్దాం.


ఈ వార్తలు కూడా చదవండి:

పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ

కాలేజీలో లైంగిక దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 07:17 AM