మీరు ప్రధాని కావాలి!
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:33 AM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని తానేనన్న సంకేతాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇచ్చారు....
దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి
రాహుల్‌గాంధీని కోరిన సీఎం రేవంత్
సానుకూలంగా స్పందించిన రాహుల్
మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులతో సమావేశంలో ఆసక్తికర పరిణామం
చప్పట్లతో మార్మోగిన సమావేశ మందిరం
రేవంత్ శక్తిమంతుడంటూ రాహుల్ ప్రశంస
బీసీ రిజర్వేషన్‌పై ప్రైవేటు బిల్లుకు సుముఖం
హైదరాబాద్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని తానేనన్న సంకేతాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇచ్చారు. దేశం కోసం రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని, ప్రధాని అభ్యర్థి బాధ్యతలు తీసుకునేందుకు ఆయన అంగీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో సోమవారం జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఇది తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కోరుతున్నానని అన్నారు. రాహుల్‌గాంధీ అంగీకరిస్తే ఆయన్ను ప్రధానిని చేసేందుకు బరాబర్ నిలిచి పోరాడతామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రితో శృతి కలిపారు. రేవంత్ ప్రతిపాదనను సానుకూలంగా తీసుకున్న రాహుల్‌గాంధీ.. మోదీపై యుద్ధానికి తాను సిద్ధమని ప్రకటించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తానే ప్రధాని అభ్యర్థినన్న సంకేతాన్ని రాహుల్‌గాంధీ తొలిసారిగా ఇచ్చారు. రాహుల్ స్పందనతో సమావేశ మందిరం చప్పట్లతో దద్దరిల్లి పోయింది. ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో రాహుల్‌గాంధీ మాటామంతీ కార్యక్రమానికి ముగింపుగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దేశం కోసం రాహుల్‌గాంధీ ప్రధాని కావాల్సిందేనన్నారు. ఆయన కుటుంబంలో ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీలు ప్రధానులుగా చేశారని గుర్తు చేసుకున్నారు. కుటుంబంలో ముగ్గురు ప్రధానులుగా చేయడంతో రాహుల్‌గాంధీకి ప్రధాని పదవిపై వ్యామోహం లేదని చెప్పారు. అత్యంత సాధారణ జీవితం గడుపుతూ, అందరితో కలిసి పోతూ రాజకీయాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘‘రాహుల్‌గాంధీ కూడా తాను ప్రధాని అయ్యేందుకు కృషి చేయాలి. దేశం కోసం ఆయన ఈ బాధ్యత తీసుకోవాలి. రాహుల్‌గాంధీ సంసిద్ధత వ్యక్తం చేయాలన్నది దేశ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల కోరిక’’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. బాధ్యత తీసుకోవడానికి తాను సిద్దమే అన్నట్లుగా రాహుల్ నవ్వుతూ తల ఊపారు. మోదీపై యుద్ధానికి తాను సిద్ధమని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగిస్తూ, గడిచిన 19 ఏళ్లలో జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి వచ్చిన తాను ప్రజాజీవితంలో ఏనాడూ పైరవీలు చేయలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చానని వివరించారు. పోరాటాల సందర్భంగా తనపై కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని చెప్పుకొచ్చారు.
రేవంత్ శక్తివంతమైన నాయకుడు: రాహుల్
సీఎం రేవంత్‌రెడ్డి శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారంటూ రాహుల్‌గాంధీ ప్రశంసించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను డీసీసీ అధ్యక్షులు తీసుకోవాలని సూచించారు. పార్టీలో పాత, కొత్తనేతలు అంటూ లేదని, అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కాగా, ప్రధాని అభ్యర్థిత్వ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్‌గాంధీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఆయన పేరును ప్రతిపాదించింది కూడా రేవంత్‌రెడ్డేనంటూ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎంపికకు సంబంధించి సీడబ్ల్యుసీ సమావేశంలో చర్చ వచ్చినప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవాలంటూ రేవంత్.. రాహుల్‌ను కోరారని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రధాని అభ్యర్థి బాధ్యతలు తీసుకోవాలంటూ రేవంత్ రాహుల్‌ను కోరడం, ఆయన సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది.
