కర్నూలు భగభగ..
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:51 AM
రాష్ట్రంపైకి పడమర, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుండటంతో రాయలసీమ, కోస్తాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సోమవారం వేడి వాతావరణం నెలకొంది.
38 డిగ్రీలతో ఉష్ణోగ్రత నమోదు
దేశంలోనే అత్యధికం
విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపైకి పడమర, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుండటంతో రాయలసీమ, కోస్తాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సోమవారం వేడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలో పలుచోట్ల ఉదయం పూట పొగమంచు కురిసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉదయం పొగమంచు కురుస్తుందని పేర్కొంది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వచ్చే నాలుగు రోజుల్లో దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి విస్తరించే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో ఈనెల ఏడో తేదీ నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.