Share News

చక్కెర మందు పక్కాగా...

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:21 AM

మధుమేహ మందులు శరీర బరువును తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉండడంతో, వీటి తయారీ ఉద్దేశం పక్కదారి పట్టి, వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌గా ఆదరణ పొందడం మొదలుపెట్టాయి. అయితే వీటిని...

చక్కెర మందు పక్కాగా...

డయాబెటిస్‌

మధుమేహ మందులు శరీర బరువును తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉండడంతో, వీటి తయారీ ఉద్దేశం పక్కదారి పట్టి, వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌గా ఆదరణ పొందడం మొదలుపెట్టాయి. అయితే వీటిని ఏ అవసరం కోసం ఎంచుకున్నా, ఎండోక్రైనాలజిస్ట్‌ పర్యవేక్షణ తప్పనిసరి.

ఇటీవల ఒజెంపిక్‌, మోంజారో ఇంజెక్షన్ల పట్ల సర్వత్రా ఆసక్తి పెరిగింది. జిఎల్‌పి -1 ఔషథ వర్గానికి చెందిన ఈ మందులను ప్రధానంగా టైప్‌-2 మధుమేహం కోసం అభివృద్ధి చేశారు. అయితే చికిత్స సమయంలో మధుమేహులు గణనీయంగా బరువు కోల్పోతున్న విషయం బయల్పడింది. కాలక్రమేణా ఈ అదనపు ప్రయోజనమే ప్రధానంగా మారి, ఈ మందులు విస్తృతంగా వినియోగంలోకొచ్చాయి. కానీ ఈ మందులను ఎండోక్రైనాలజిస్ట్‌ పర్యవేక్షణలో వాడుకోవడం తప్పనిసరి.

ఊబకాయులందరూ మధుమేహులు కారు

మధుమేహం జీవనశైలి రుగ్మత అనుకుంటాం. కానీ ఊబకాయులందరూ మధుమేహానికి గురి కావాలనే నియమం లేదు. ఊబకాయం ఫలితంగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తలెత్తినప్పుడే మధుమేహం తలెత్తుతుంది. అలాగే క్లోమం, కాలేయాల్లో కొవ్వు పెరగడం వల్ల మధుమేహం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మధుమేహాన్ని కేవలం మెటబాలిక్‌ డిసీజ్‌గానే చూడడానికి వీల్లేదు. దీన్లో అంతఃస్రావ గ్రంథుల ప్రమేయం కూడా ఉంటుంది. కాబట్టి జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రించుకోవడం, వచ్చిన మధుమేహం మరింత తీవ్రమవకుండా చూసుకోవడం సాధ్యమే! కాబట్టి మధుమేహాన్ని బలమైన మెటబాలిక్‌ కాంపొనెంట్‌ కలిగిన అంతఃస్రావ సమస్యగానే పరిగణించాలి.


మధుమేహం జీవనశైలి వ్యాధి కాదు

బరువు పెరగడం మూలంగా వేధించే మధుమేహాన్ని చాలా మంది జీవనశైలి రుగ్మతగా భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. బరువు పెరిగిన ప్రతి ఒక్కరూ మధుమేహం బారిన పడతారని కచ్చితంగా నిర్థారణ కాలేదు. కొవ్వు కణజాల వైఫల్యం, క్లోమం, కాలేయాల్లో కొవ్వు పెరగడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్లీహంలోని బి సెల్‌ వైఫల్యాలు మధుమేహానికి ప్రధాన కారణాలు. అలాగే మధుమేహంలో అంతఃస్రావ గ్రంథుల పాత్ర కూడా పెద్దదే! కాబట్టి మధుమేహాన్ని నివారించుకోవడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వ్యాయామాలతో పాటు అంతఃస్రావ గ్రంథుల పనితీరు మీద కూడా దృష్టి పెట్టాలి. మధుమేహాన్ని జీవక్రియ ఆధారిత అంతఃస్రావ రుగ్మతగానే పరిగణించాలి.

మారిన మధుమేహం ధృక్పథం

గత దశాబ్ద కాలంలో ఊబకాయం, మధుమేహం నిర్వహణలో ఎంతో పురోగతి చోటుచేసుకుంది. ఒజెంపిక్‌, మొంజారో మందులు ఈ రుగ్మతల చికిత్సల్లో కీలకంగా మారాయి. 1980ల నుంచి ఊబకాయానికి అనేక మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి అనుకున్నంత ప్రభావాన్ని కనబరచలేకపోయాయి. ప్రధాన దుష్ప్రభావాలతో పాటు కేవలం ఐదారు కిలోల బరువును మాత్రమే తగ్గించగలిగేవి. కానీ మూడో తరం జిఎల్‌పి-1 మందులతో శరీర బరువులో 15 నుంచి 20 శాతం బరువును కోల్పోవడం సాధ్యపడుతోంది. పలు సందర్భాల్లో ఈ భారీ బరువు తగ్గింపు, మధుమేహ నియంత్రణకు తోడ్పడి, సంబంధిత మందులను వాడుకోవలసిన అవసరం తప్పుతోంది. ఈ చికిత్సతో మధుమేహాన్ని సమూలంగా రూపుమాపలేకపోయినప్పటికీ, మందుల నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ మందులను దీర్ఘకాలం పాటు వాడుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలినీ, ఆహారపుటలవాట్లనూ కొనసాగించగలిగితే, మధుమేహ మందులను వాడుకునే అవసరం లేకుండా, తగ్గిన బరువుతో కొనసాగే వీలు కలుగుతుంది


త్వరలో అందుబాటు ధరల్లో...

మార్చి ఒకటి నుంచి ఒజెంపిక్‌ ధర గణనీయంగా తగ్గనుంది. గత ఏడాది భారతదేశంలో ఈ మందు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బేరియాట్రిక్‌ సర్జరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బేరియాట్రిక్‌ సర్జరీలతో సాధించే 15 నుంచి 20 శాతం వెయిట్‌ లాస్‌, నేడు మూడు ఇంజెక్షన్లతో సాధ్యపడుతోంది. అలాగే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్న ఒకట్రెండేళ్లకు మళ్లీ బరువు పెరిగే అవకాశాలుంటాయి. ఆ బరువు పెరగకుండా ఉండడం కోసం మళ్లీ ఇవే ఇంజెక్షన్ల మీద ఆధారపడవలసి వస్తుంది. సాధారణంగా బేరియాట్రిక్‌ సర్జరీల విషయంలో ఒక వాదన ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. సర్జరీకయ్యే ఒకే ఒక ఖర్చుతో మధుమేహాన్ని పరిష్కరించుకునే వీలున్నప్పుడు, ఇంజెక్షన్ల కోసం పదే పదే డబ్బు ఖర్చు పెట్టవలసి అవసరం ఏముందనే వాదన వినిపించేది. కానీ ఇప్పుడు ధరలు మరింత తగ్గబోతున్నాయి కాబట్టి అనేక మంది మధుమేహులకు బేరియాట్రిక్‌ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. కొందరు బరువు తగ్గడం కోసం లైపోసక్షన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. కానీ దీంతో ఎప్పటికీ బరువు పెరగకుండా ఉండే వీలుండదు. లైపోసక్షన్‌ తదనంతరం కొన్ని నెలల వ్యవధిలోనే శరీరంలో కొవ్వు పేరుకుంటుంది. పైగా ఈ చికిత్స కొన్ని ప్రధాన సమస్యలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ చికిత్సను ఆశ్రయించకపోవడమే ఉత్తమం.

ఎండోక్రైనాలజిస్ట్‌ పర్యవేక్షణలో...

సెమాగ్లుటైడ్‌ దాని అనుబంధ జిఎల్‌పి-1 రిసెప్టార్‌ అగోనిస్ట్స్‌ మందులు ప్రధానంగా టైప్‌-2 మధుమేహం కోసం రూపొందాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపరచడం, కార్డియోమెటబాలిక్‌ ముప్పును తప్పించడం వీటి ప్రధాన లక్ష్యాలు. అయితే చికిత్స సమయంలో కొన్ని బరువు తగ్గడం లాంటి కొన్ని అదనపు ప్రయోజనాలు బయల్పడ్డాయి. కాలక్రమేణా ఈ మెటబాలిక్‌ ప్రయోజన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దాంతో ప్రత్యేకించి ఊబకాయం కోసం అత్యధిక మోతాదుతో కూడిన మందులను అభివృద్ధి చేశారు. తక్కువ మోతాదుల్లో మధుమేహాన్ని నియంత్రించే ఈ మందులు, ఎక్కువ మోతాదుల్లో ఊబకాయ చికిత్సకు తోడ్పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ, బరువు తగ్గించే మందులుగా ఇవి పొందుతున్న ప్రచారం, ప్రజాదరణ వల్ల బరువు తగ్గించే ప్రక్రియ పక్కదారి పడుతోంది.


ప్రత్యేక నిపుణుల ప్రమేయం ఎందుకంటే...

ఈ మందులు కేవలం ఎండోక్రైనాలజి్‌స్టలు మాత్రమే సూచించాలి. చికిత్స వారి పర్యవేక్షణలోనే సాగాలి. ఎందుకంటే....

  • రోగుల ఎంపిక ఎంతో జాగ్రత్తగా జరగాలి

  • జీర్ణసంబంధ దుష్ప్రభావాలను తగ్గించడం కోసం మందుల మోతాదును క్రమేపీ పెంచాలి

  • దీర్ఘకాల మెటబాలిక్‌ లక్ష్యాలను (గ్లైసెమిక్‌, కార్డియోవాస్క్యులర్‌, రీనల్‌) పరిశీలించాలి

  • పోషకాల లోపం, కండర నష్టాలను అంచనా వేయాలి

  • బరువు తగ్గడానికి సంబంధించిన అంచనాలు వాస్తవికంగా ఉండాలి

ప్రారంభంలో ఈ మందుల వాడకం, చికిత్సలు ప్రత్యేక నిపుణులకే పరిమితమై ఉండేవి. కానీ ప్రస్తుతం వీటి వాడకం విస్తృతమై, దీర్ఘకాలిక ప్రణాళికలతో పనిలేకుండా యధేచ్ఛగా సాగుతోంది.

డ్రగ్‌ అబ్యూజ్‌

ఎండోక్రైనాలజి్‌స్టల ఉపయోగం కోసం తయారైన ఈ మందులను డెర్మటాలజిస్టులు, కాస్మటిక్‌ నిపుణులు, ప్లాస్టిక్‌ సర్జన్లు, ఫెర్టిలిటీ నిపుణులు, డైటీషియన్లు కూడా సూచిస్తున్నారు. కానీ నిజానికి కొన్ని కోవలకు చెందిన వాళ్లు ఈ మందులు వాడుకోకూడదు. ఎవరంటే..

  • తీవ్రమైన జీర్ణసంబంధ సమస్యలున్నవారు

  • రెటీనా సమస్యలున్నవారు

  • పిత్తాశయ సంబంధిత సమస్యలున్నవారు

  • ప్లీహ సమస్యలున్నవారు

  • మెడుల్లరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌ కుటుంబ చరిత్ర కలిగినవారు

  • డయాబెటిక్‌ గ్యాస్ట్రైటిస్‌ సంబంధిత సమస్యలున్నవారు

డాక్టర్‌ శ్రీ నగేష్‌

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌,

శ్రీ నగేష్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌,

టోలిచౌకి, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 01:21 AM