Share News

భారత్‌కు కెనడా యురేనియం

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:46 AM

భారత్‌కు యురేనియం సహా ఇతర కీలక ఖనిజాలను సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్‌ డాలర్ల సుమారు రూ.4.15 లక్షల కోట్ల ......

భారత్‌కు కెనడా యురేనియం

  • పౌర ఇంధన అవసరాల కోసమే.. క్యాంప్‌సలు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు

  • స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’గా మార్పు

  • ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ, కార్నేల చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 2: భారత్‌కు యురేనియం సహా ఇతర కీలక ఖనిజాలను సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.15 లక్షల కోట్ల డాలర్లు) స్థాయికి చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇవన్నీ అమలుకు వీలుగా ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందా’ (కాంప్రెహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ అగ్రిమెంట్‌-సీఈపీఏ)న్ని కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్‌ కార్నే, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య సోమవారం ఇక్కడి హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రక్షణ రంగం, కీలక సాంకేతిక పరిజ్ఞానం, చిన్న, మాడ్యులర్‌ తరహా అణు రియాక్టర్ల సరఫరా, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. పౌర అణు విద్యుత్తు కోసం కెనడా 2.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.24వేల కోట్లు) యురేనియాన్ని సరఫరా చేయనుంది. అమెరికాతో ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్న కెనడా అందుకు అనుగుణంగా చర్చలు జరిపింది. తొలుత ముంబైలో దిగి అక్కడ రెండు రోజులు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపిన ప్రధాని కార్నే ఆదివారం ఢిల్లీ రావడం గమనార్హం. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 13 బిలియన్‌ డాలర్లు (రూ.1.20వేల కోట్లు) వరకు ఉండగా, దాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకే రెండు దేశాల్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు ఈ సందర్భంగా మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో కెనడా పెట్టుబడిదార్లు 100 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9లక్షల కోట్లు)వరకు పెన్షన్‌ ఫండ్‌ల్లో పెట్టారని, దేశం వృద్ధిపై వారికున్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని చెప్పారు.


దీర్ఘకాలం పాటు యురేనియం సరఫరా చేయడం కీలక అంశమని తెలిపారు. ఇంధన రంగంలో రానున్న తరానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపైనా ఒప్పందం కుదిరిందని చెప్పారు. హైడ్రో కార్బన్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎనర్జీ స్టోరేజ్‌, సౌర, పవన విద్యుత్తు, విద్యుత్తు వాహనాలు, తదితర అంశాల్లో సహకారం ఉంటుందని వివరించారు. విద్యా రంగంలో కుదిరిన ఒప్పందాలను మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఏఐ, ఆరోగ్యం, వ్యవసాయం, ఆవిష్కరణలు తదితర అంశాల్లో ఇరు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. కెనడా యూనివర్సిటీలు భారత్‌లో క్యాంప్‌సలు ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిస్థితిపైనా చర్చించారు. సంప్రదింపులు, దౌత్యపర మార్గాల్లోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన, నమ్మకమైన ఇంధన సరఫరా కోసమే యూరేనియం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కెనడా ప్రధాని కార్నే తెలిపారు. దీనిని ‘ల్యాండ్‌ మార్క్‌’ ఒప్పందంగా ఇరు దేశాలు అభివర్ణించాయి. రెండు దేశాల మధ్య కుదిరే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్నే అధికారికంగా ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’గా పిలుచుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలపై రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూప్‌ గోయల్‌, మణీందర్‌ సిద్ధులు సంతకాలు చేశారు. ఒప్పందంలోని అంశాలను త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించారు.

Updated Date - Mar 03 , 2026 | 04:46 AM