దసరాకు కొత్త పింఛన్లు..
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:36 PM
రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు చేయూత పింఛన్లు మంజూరు చేయనుంది.
ఈ దఫాలో వృద్ధాప్య పింఛన్లు లేనట్లే
కొన్ని వర్గాల వారికి మాత్రమే చేయూత పింఛన్లు
హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు చేయూత పింఛన్లు మంజూరు చేయనుంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు మాత్రం ప్రస్తుతం ఇవ్వడం లేదు. ఈ దఫా కేవలం వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు మాత్రమే కొత్త పింఛన్లు ఇవ్వనున్నారు. వీరి దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయడంతో వాటిని మండలస్థాయి అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణను పూర్తి చేశారు.
13206 ఎంపిక
హనుమకొండ జిల్లాలోని 14 మండలాల పరిధిలో నూతనంగా చేయూత పింఛన్ కోసం మొత్తం 15,025 దరఖాస్తులు నమోదయ్యాయి. వితంతువులు 7,583 దరఖాస్తు చేసుకోగా దివ్యాంగులు 3,990, కల్లుగీత కార్మికులు 1,584, ఒంటరి మహిళలు 991, చేనేత కార్మికులు 877, ఫైలేరియా బాధితులు 285, డయాలసిస్ బాధితులు 90 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేశారు. 13206 మందిని అర్హులుగా గుర్తించి అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఇందులో మండల స్థాయి అధికారులకు మరింత క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రక్షాళన చేపట్టనున్నారు. ఆ తర్వాత జిల్లాస్థాయి అధికార, యంత్రాంగం పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నూతన పింఛన్ అందుకోనున్నారు.
దసరాకు కొత్త పింఛన్
ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అర్హులైన పేదలకు నూతన పింఛన్లు అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతతో దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, భాసటగా నిలిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. పండుగ వెలుగుల్లో ప్రతీ పేద కుటుంబం సంతోషంగా ఉండాలనే సత్సంకల్పంతో ఈ పింఛన్ల ప్రక్రియను శరవేగంగా కొలిక్కి తెచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ దసరా కానుకపై లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను జగిత్యాల ‘మంచినీళ్ల బావి’ని..
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News