Share News

భీమ్‌గల్ పీఎస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి.. స్పందించిన సీపీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:39 AM

జిల్లాలోని భీమ్‌గల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో టీ స్టాల్ యజమాని సుధాకర్ మృతి అంశంలో పోలీసుల తప్పేమీ లేదని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నిప్పుంటించుకున్నప్పుడు అక్కడే ఉన్న పోలీసు సిబ్బందితోపాటు పలువురు వ్యక్తులు.. ఆ మంటలను ఆర్పారని వివరించారు.

భీమ్‌గల్ పీఎస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి.. స్పందించిన సీపీ
Nizamabad city police commissioner

నిజామాబాద్, అక్టోబర్ 06: జిల్లాలోని భీమ్‌గల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో టీ స్టాల్ యజమాని సుధాకర్ మృతి విషయంలో పోలీసుల తప్పేమీ లేదని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నిప్పుంటించుకున్నప్పుడు అక్కడే ఉన్న పోలీసు సిబ్బందితోపాటు పలువురు వ్యక్తులు.. ఆ మంటలు ఆర్పారని వివరించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర సీపీ సాయి చైతన్య విలేకర్లతో మాట్లాడుతూ.. పాత బస్టాండ్‌లో టీ స్టాల్ నడుపుకుంటున్న సుధాకర్‌కు ఎదురుగా ఉన్న కిరాణా షాప్ యజమానితో గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు.


తన దగ్గర సిగరెట్లు కొనడం లేదంటూ రిపోర్టర్లను పంపి.. సుధాకర్‌ను కిరాణా షాప్ యజమాని బెదిరించారని పేర్కొన్నారు. రిపోర్టర్లు బెదిరించిన విషయాన్ని మనస్సులో పెట్టుకుని సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నగర సీపీ తెలిపారు. ఈ విషయంలో పోలీసు శాఖకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే అర్ధరాత్రి వరకు టీ స్టాల్ నడుపుతున్నాడని అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.


భీమ్‌గల్ బస్టాండ్ వద్ద సుధాకర్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి టీ స్టాల్‌ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. సోమవారం ఉదయం అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడిని కోర్టుకు వెళ్లాలంటూ సూచించారు. దీంతో పోలీస్ స్టేషన్‌లోనే అతడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


మెరుగైన వైద్య చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. సుధాకర్ మృతికి పోలీసుల వేధింపులే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌ కలకలం

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం: కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం

Updated Date - Oct 06 , 2026 | 11:52 AM