Share News

నేను జగిత్యాల ‘మంచినీళ్ల బావి’ని..

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:33 AM

‘‘నేను జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావిని... ఇప్పటి తరా నికి నేను తెలియకపోవచ్చు.. కానీ నా చుట్టూ పెరి గిన తరాలకు మాత్రం నేను కొత్త కాదు.

నేను జగిత్యాల ‘మంచినీళ్ల బావి’ని..
Jagtial Manchineella Baavi

  • వేలాది మంది దాహార్తి తీర్చా..

  • జగిత్యాల జైత్రయాత్రకు సాక్షిని

  • ఒకప్పుడు పండుగొస్తే నా చుట్టూ జాతరే..

  • ఇప్పటికీ బస్టాప్‌ పేరుతో ప్రజల నోళ్లలో నానుతున్నా..

జగిత్యాల: ‘‘నేను జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావిని... ఇప్పటి తరా నికి నేను తెలియకపోవచ్చు.. కానీ నా చుట్టూ పెరి గిన తరాలకు మాత్రం నేను కొత్త కాదు. వాళ్ల చిన్న నాటి జ్ఞాపకాల్లో ఉన్నా.. వాళ్ల తల్లుల బిందెల్లో నేను ఉన్నా.. అప్పట్లో జగిత్యాల పట్టణానికి నల్లాలు లేవు. ఇంటింటికీ బోర్లు లేవు. మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతుండేవారు.. అలాంటి కాలంలో జగిత్యాలకు చెందిన ఓ పెద్దాయన సుమారు 1926 సంవత్సరంలో నిజామాబాద్‌ రోడ్డు వైపున, చెరువు కట్ట కింది భాగంలో సుమారు 15 అడుగుల చుట్టూ కొలతలతో 40 అడుగుల లోతుతో నన్ను తవ్వించాడు. నా నాలుగు దిక్కులా నాలుగు నీరు తోడే గిరకలు ఇనుప వాటితో ఏర్పాటు చేశారు. విరామం లేకుండా నీరు చేదుకుంటుండే వారు’’ అని తన ఆత్మకథను జగిత్యాలలోని మంచినీళ్ల బావి వివరిస్తోంది..


పొద్దు పొడవక ముందే బిందెలు పట్టుకొని..

టవర్‌ సర్కిల్‌, తీన్‌ఖని చౌరస్తా, పోచమ్మవాడ, ఖిల్లా కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పొద్దు పొడవకముందే బిందెలు, కుండలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేటోళ్లు. నా దగ్గరే రోజు మొదలయ్యేది. ఒకరు ఇనుప తాడు వేసి నీళ్లు తోడు తుంటే.. ఇంకొ కరు బిందె పట్టుకునేటోళ్లు. ఇనుప బిందె నిండేలోపు కబుర్లు కూడా నిండిపోయేవి.


నా కళ్లముందే జగిత్యాల మారిపోయింది

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! నన్ను ఉపయోగించిన తరాలు ఒక్కొక్కటిగా మారిపోయాయి. పట్టణం పెరిగింది. ఇంటింటికీ బోర్లు, నల్లాలు వచ్చాయి. పైపుల ద్వారా నీళ్లు రావడం మొదలైంది. అలా నెమ్మదిగా నా దగ్గరకు వచ్చే అడుగులు తగ్గిపోయాయి.


water2.2.jpgఉద్యమాలకు సాక్షిని..

1947లో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాల నుంచి జనాలు కదిలి వచ్చారు. రహదారులు జనంతో నిండిపోయాయి. ఆ భారీ ప్రజా కదలికకు నా పరిసరాలు కూడా సాక్షిగా నిలిచాయి. ఆ రోజు నేను నీళ్లు ఇచ్చి న బావిగా మాత్రమే లేను.. ఒక చారిత్రక ఘట్టాన్ని చూసిన ప్రదేశంగా మారాను. అప్పట్లో నా చుట్టూ చేరి న జనాన్ని చూసి.. ‘జగిత్యాల అంటే ఇదేనా!’ అని నేనే ఆశ్చర్యపోయాను. జైత్రయాత్రకు వచ్చిన ప్రజాగాయ కుడు గద్దర్‌ పాటలు విన్నాను. పలువురు ఉద్యమకా రులు నా గట్టు చుట్టూ కూర్చొని సద్ది తిన్న జ్ఞాపకం నాకు ఉంది.


ఊరి మనుషుల్ని కలిపే చోటు..

అప్పట్లో నేను కేవలం బావిని కాదు.. ఊరి మను షుల్ని కలిపే చోటును కూడా. పిల్లల అల్లరి..పెద్దల ముచ్చట్లు నా చుట్టూ పెరిగిన పిల్లల్ని నేనెలా మరిచి పోగలను.. గట్టు పక్కన పరుగులు, బొంగరాలు, దాగుడు మూతలు వంటి ఆటలతో సాయంత్రం వరకు నా చుట్టూ సందడే. వేసవి సెలవులొస్తే ఇంక చెప్పాల్సిన పనిలేదు. పొద్దంతా పిల్లల గొడవలు, నవ్వులు, అరుపులే వినిపించేవి.


water2.jpgపెద్దోళ్లు మాత్రం ఒక మూలన కూర్చొని ఊరి సంగతులు మాట్లాడుకునే టోళ్లు. నాకు మాట వచ్చి ఉంటే ఆ రోజుల్లో జగిత్యాల పట్టణ చరిత్రలో సగం నేనే చెప్పగలిగేవాడిని. సాధా రణ రోజుల్లో నీళ్ల కోసం వచ్చే జనంతో సందడిగా ఉండేదాన్ని. బతుకమ్మ పండుగ సమయంలో పూల తో వచ్చిన మహిళలతో నా చుట్టు పక్కల కళకళలా డేది. నన్ను కేవలం మహిళల బావి అనుకుంటే పొరపాటే. పురుషులూ నా దగ్గరికి సైకిళ్లపై వచ్చేవా రు. తమ ఇళ్లకు కావాల్సిన నీటిని బిందెల్లో, ఇతర పాత్రల్లో నింపుకుని తీసుకెళ్లేవారు.


జగిత్యాల గతాన్ని గుర్తు చేస్తున్నా..

నా జ్ఞాపకాలు ఇప్పటి తరాలకు తెలియాలి. ఎందుకంటే నేను ఒక బావిని మాత్రమే కాదు.. జగిత్యాల పట్టణం ఎదిగిన తీరుకు ఒక గుర్తు. అప్పుడప్పుడూ నా దగ్గర కొందరు పెద్దాయనలు ఆగి ‘ఇక్కడే కదా మేం నీళ్లు తోడుకున్నది..’ అని పక్కనున్న వాళ్లకు చెబుతారు. ఆ మాట విన్నప్పుడు నాకు మళ్లీ పాత రోజులు గుర్తొస్తాయి. నాకు ఇప్పుడు నీళ్లు లేకపోవచ్చు. కానీ నా లోపల జ్ఞాపకాలు మాత్రం నిండుగానే ఉన్నాయి.


నా దగ్గర నీళ్ల కోసం ఎవరూ రాకపోయినా..నా పేరు మాత్రం ఇంకా ఈ పట్టణం నోట ఉంది. ‘మంచినీళ్ల బావి’ అని ఆర్‌టీసీ స్టాప్‌ నా పేరిట ఉంది. నన్ను చూసి పాత రోజులను గుర్తుచేసుకునే వృద్ధులు అప్పుడప్పుడు ఆగుతారు. వారి మాటల్లో నేను మళ్లీ బతుకుతాను. ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆగండి. నా గుండెల్లోకి తొంగిచూడండి. మీకు నీళ్లు కనిపించకపోవచ్చు. కానీ ఒకప్పుడు నా నీళ్లతో దాహం తీర్చుకున్న జగిత్యాల కనిపిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని

‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 11:33 AM