లెక్కలు చెప్పరు.. బోర్డులో చూపెట్టరు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:39 AM
గ్రేటర్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
గ్రేటర్‌లో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న పలు విద్యాసంస్థలు
ఫీజుల నియంత్రణ కమిటీ లేకపోవడంతో యథేచ్ఛగా దందా
విద్యాశాఖకు ఆడిట్ నివేదికలు ఇవ్వడంలో జాప్యం
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఫీజుల వివరాలు, ఆడిట్ లెక్కలు సమర్పించాలని ఆయా పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకు చాలా స్కూళ్ల నిర్వాహకులు పట్టించుకోకపోవడం లేదు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 6,289 ప్రైవేట్ పాఠశాలలున్నాయి.
వాటిలో సుమారు 19.50 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కాగా, మూడు జిల్లాల్లో అనధికారిక స్కూళ్లు 500 వరకు ఉన్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు దాదాపు 60 వరకు, మిగతావి కార్పొరేట్, టెక్నో, బడ్జెట్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. విద్యా వ్యాపారమే లక్ష్యంగా కొన్ని ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో విద్యాసంస్థలు దొరికినకాడికి దోచుకుంటున్నాయి. అడ్మిషన్ నుంచి మొదలుకుని నెలవారీ ఫీజుల వరకు అన్నింటిలో 25 నుంచి 30 శాతం పెంచి వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఎల్‌కేజీ అడ్మిషన్‌కు రూ.2 నుంచి 3 లక్షలు !
సీబీఎ్‌సఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ అడ్మిషన్లకు పెద్దఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారు. కొండాపూర్‌లోని ఓ పేరొందిన ఇంటర్నేషనల్ పాఠశాలలో ఎల్‌కేజీ అడ్మిషన్ ఫీజు రూ.1.50 లక్షలు, వార్షిక ఫీజు రూ.1,78,100, మొత్తం కలిపి రూ. 3,28,100 లక్షలు తీసుకుంటున్నారు. అలాగే ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్‌లోని మరో సీబీఎ్‌సఈలో నర్సరీకి అడ్మిషన్ ఫీజు రూ.95వేలు, ఏడాది ఫీజు రూ.1.55 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
దీంతో ఆయా పాఠశాలల్లో సంపన్నవర్గాలకు చెందిన కుటుంబాలే తప్ప.. నెలవారీ వేతనంపై ఆధారపడిన ఉద్యోగులు, ఇతరులు తమ పిల్లలను చదివించలేని పరిస్థితి నెలకొంది. కాగా, మరికొన్ని ఇంటర్నేషల్, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతికి ఏడాదికి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టబద్ధమైన కమిటీ, నియంత్రణ కమిషన్ ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడిట్ లెక్కల సమర్పణలో జాప్యం..!
నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మూడేళ్ల ఆడిట్ లెక్కల వివరాలు ఇవ్వాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇందులో 90శాతం మంది ఇప్పటివరకు వాటిని సమర్పించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యాశాఖ చెప్పిన విధంగా వివరాలు అందజేస్తే ఫీజుల దోపిడీ బయటపడుతుందనే భావనతో చాలామంది ఇవ్వడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 2,275 ప్రైవేట్ పాఠశాలల్లో 2,260, మేడ్చల్‌లో 1968 పాఠశాలల్లో 1,952, రంగారెడ్డిలో 2,046 పాఠశాలల్లో 2,039 స్కూళ్లు ఆడిట్ లెక్కలు ఇవ్వకపోవడం గమనార్హం. విద్యాశాఖ ఆదేశాలను అమలు చేయడంలో గ్రేటర్ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ప్రైవేట్ స్కూళ్ల వసూళ్లకు అంతులేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్‌లో ఏటా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు!
గ్రేటర్‌లోని ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో స్కూళ్లలో ఏటా రూ.1000 కోట్లకు పైగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే అంచనా ఉంది. ఒకసారి స్కూల్‌లో అడ్మిషన్ పొందిన తర్వాత బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలతో పాటు వివిధ రకాల ఫీజులతో తల్లిదండ్రులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏటా పెంచుతున్న ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో పాటు నోటీసు బోర్డులో పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఫీజుల లెక్కలు తేల్చాలి
ప్రైవేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాల లెక్కలు తప్పనిసరిగా తేల్చాలి. ఆయా విద్యా సంస్థలు విద్యాశాఖకు తక్షణమే ఆడిట్ సమర్పించాలి. ఈ విషయంపై గ్రేటర్‌లోని విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, వివరాలు సమర్పించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి.
పృథ్వీతేజ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ
ఈ వార్తలు కూడా చదవండి:
సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News