సౌదీపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు.. రంగంలోకి మక్కా డిఫెన్స్ అలైన్స్
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:51 AM
సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయం, రబిఘ్‌లోని ఆరామ్‌కో రిఫైనరీతో పాటు పలు కీలక సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
సనా/రియాద్, అక్టోబర్ 6: యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియాలోని రాజధాని రియాద్ విమానాశ్రయం, రబిఘ్‌లోని ఆరామ్‌కో (Aramco) ఆయిల్ రిఫైనరీ, పలు కీలక సైనిక స్థావరాలపై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు ప్రకటించాయి. ఈ దాడులను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర పదజాలంతో ఖండించింది. (Saudi Houthi Attacks)
దాడుల వివరాలు (హౌతీ మిలిటరీ ప్రకటన ప్రకారం)
ఆపరేషన్ 1: రియాద్ విమానాశ్రయంపై దాడి
రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు. ఈ దాడి వల్ల విమాన రాకపోకలకు విఘాతం కలిగిందని హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ పేర్కొన్నారు.
ఆపరేషన్ 2: ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీ
రబిఘ్ (Rabigh) ప్రాంతంలోని సౌదీ ఆరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారం పై క్షిపణి దాడి జరిగిందని, దీనివల్ల అక్కడ భారీగా మంటలు చెలరేగాయని తెలిపారు.
ఆపరేషన్ 3: సైనిక స్థావరాలపై దాడులు
అభ విమానాశ్రయం, ఖమీస్ ముషాయత్ ఎయిర్ బేస్, నజ్రాన్, జిజాన్, అసిర్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై మూడో విడత దాడులు జరిపినట్లు హౌతీ ప్రకటించింది.
సౌదీ అరేబియా హెచ్చరిక
'శాంతి ప్రతిపాదనలను తిరస్కరిస్తూ పౌరులు, ఆర్థిక మౌలిక వసతులు, పవిత్ర క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని హౌతీ ఉగ్రవాద మూకలు జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా భూభాగాన్ని, ప్రజలను, వనరులను కాపాడుకోవడానికి అంతర్జాతీయ చట్టాలకు లోబడి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు సౌదీకి ఉంది.' అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరగడం, సౌదీ చమురు సంపత్తిని లక్ష్యంగా చేసుకోవడంతో మక్కా డిఫెన్స్ అలైన్స్ పరిధిలోని సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియేలు తమ ఉమ్మడి సైనిక బలగాలను మోహరించే ప్రక్రియను వేగవంతం చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్