Share News

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:59 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భారత జట్టులో మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన సూర్యకు.. తాజాగా ముంబై రంజీ జట్టులోనూ స్థానం దక్కలేదు.

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భారత జట్టులో మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన సూర్యకు.. తాజాగా ముంబై రంజీ జట్టులోనూ స్థానం దక్కలేదు. చండీగఢ్‌తో అక్టోబర్ 11న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. సూర్యకుమార్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


మరోవైపు యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేకు సెలక్టర్లు కీలక బాధ్యతలు అప్పగించారు. అతడిని జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్‌లో ముంబై జట్టుకు నాయకత్వం వహించేలా 19 ఏళ్ల మాత్రేను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత అండర్-19 జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపిన మాత్రేకు ఇప్పటివరకు 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం మాత్రమే ఉంది.


సూర్య సందేశం పంపినా..

ముంబై సెలక్షన్ కమిటీకి సూర్యకుమార్ సందేశం పంపినప్పటికీ.. అతడిని జట్టులోకి తీసుకోలేదని సమాచారం. రెడ్‌బాల్ క్రికెట్‌లో అతడి ఫామ్‌పై సెలక్టర్లకు నమ్మకం కుదరలేదని తెలుస్తోంది. గత 18 నెలలుగా సూర్యకుమార్ ఒక్క రెడ్‌బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ముందుగా కొన్ని మ్యాచ్‌లు ఆడి రిథమ్ అందుకోవాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. సూర్యను ఎందుకు ఎంపిక చేయలేదన్న దానిపై ముంబై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రమేశ్ పవార్ వివరణ ఇచ్చాడు. ‘సూర్య గొప్ప ఆటగాడు. ముంబై తరఫున అతడు ఎన్నో మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. అయితే గత 18 నెలలుగా రెడ్‌బాల్ మ్యాచ్ ఆడలేదు. కొన్ని మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లోకి రావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది’ అని పవార్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేలోకి హార్దిక్ పాండ్య.. జహీర్ ఖాన్ కారణంగా మారిన సమీకరణాలు!

భారత్ మాకు క్షమాపణ చెప్పాల్సిందే.. డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న పాకిస్థాన్

Updated Date - Oct 06 , 2026 | 10:02 AM