Share News

ఆ విమానాన్ని కూల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:25 AM

ఫ్లైదుబాయ్ విమానం ఉదంతానికి సంబంధించి అమెరికా మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. టెల్ అవీవ్ వైపుగా వస్తున్న విమానాన్ని కూల్చేద్దామని ఇజ్రాయెల్ ఒకానొక దశలో భావించినట్టు తెలిసింది.

ఆ విమానాన్ని కూల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్
Flydubai Incident

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానం ఉదంతానికి సంబంధించి అమెరికా మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. టెల్ అవీవ్ వైపుగా వస్తున్న విమానాన్ని కూల్చేద్దామని ఇజ్రాయెల్ ఒకానొక దశలో భావించినట్టు తెలిసింది. ఫైటర్ జెట్స్‌ను కూడా రంగంలోకి దింపింది. అయితే, చివర్లో విమానం సౌదీ వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను విరమించుకుంది.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు (ఇజ్రాయెల్)‌ బయలుదేరిన విమానంలో కోపైలట్ హమ్మమ్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి విమానాన్ని తన అదుపులోకి తీసుకుందామనుకున్న విషయం తెలిసిందే. 9/11 దాడి తరహాలో టెల్ అవీవ్‌లోని ఎత్తైన భవనాన్ని విమానంతో ఢీకొడదామని అతడు భావించినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విమానం సేఫ్‌గా తబుక్‌లో (సౌదీ) ల్యాండైంది.


పైలట్ల మధ్య ఘర్షణల సమయంలో విమానం 30 క్షణాల వ్యవధిలోనే 16 వేల అడుగుల మేర కిందకు దిగడం కలకలానికి దారి తీసింది. ఈ సందర్భంగానే ఇజ్రాయెల్ అప్రమత్తమైనట్టు తెలిసింది. విమానంలో కలకలం విషయం తెలియగానే ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసేసింది. ఫ్లైదుబాయ్ విమానాన్ని అవసరమైతే కూల్చేద్దామని కూడా ఒకానొక దశలో ఇజ్రాయెల్ దళాలు నిర్ణయించాయి.

ఈ దిశగా ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగాయి. తొలుత ఫైటర్ జెట్ పైలట్లు ఫ్లైదుబాయ్‌ విమానం సమీపానికి వెళ్లి కాక్‌పిట్‌లో ఏం జరుగుతోందో స్వయంగా చూసి అంచనాకు రావాలని భావించారు. ఈ సందర్భంగా హైజాకర్ల నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ తరువాత అవసరమైతే విమానాన్ని కూల్చేద్దామనుకున్నారు. అప్పటికే ఫ్లైదుబాయ్ విమానాన్ని ప్రయాణికులు అదుపులోకి తీసుకోవడంతో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది. ఫ్లైదుబాయ్ కలకలం నేపథ్యంలో సౌదీ కూడా తన ఫైటర్ జెట్స్‌ను పంపినట్టు తెలిసింది.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి వెనుక ఇరాన్ ఉందనిపిస్తోంది: ట్రంప్

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు.. మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం

Updated Date - Oct 06 , 2026 | 10:48 AM