‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:17 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది.
3 నెలల్లో బస్సెక్కిన మహిళలు 35.65 కోట్లు: నాగిరెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పథకానికి రోజురోజుకూ ప్రయాణికుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రవాణా సదుపాయాలను నిరంతరం విస్తరిస్తోంది. 2025తో పోలిస్తే.. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025 మూడో త్రైమాసికంలో 34.67 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా, 2026 మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య ఏకంగా 35.65 కోట్లకు చేరింది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గత ఏడాదితో పోలిస్తే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ మూడు నెలల్లో ఒక్క ఆగస్టులోనే 48.27 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. మరోవైపు.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను నిరంతరం పరిశీలిస్తూ.. బస్సుల సంఖ్యను, ట్రిప్పులను పెంచడంతో మహిళలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తోంది.
రద్దీకి అనుగుణంగా ట్రిప్పులు : ఎండీ నాగిరెడ్డి
మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళా ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులను, బస్సులను సమకూరుస్తున్నామని చెప్పారు. రాబోయే పండుగల సీజన్లలో కూడా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని ప్రత్యేక సర్వీసులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి...
రామప్పకు ముప్పులేదు
రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్
Read Latest Telangana News And Telugu News