Share News

సంచలన నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:05 AM

భారత మహిళల క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. నాయకత్వ బాధ్యతలకు వీడ్కోలు పలికింది.

సంచలన నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ కప్ విజేత హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లలో భారత మహిళల జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇటీవలే ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన హర్మన్.. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది.


‘భారత మహిళల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు ఈ ప్రయాణంలో ఉన్నాయి. జట్టు మెరుగ్గా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. జట్టులో ఇక నుంచి ప్లేయర్‌గానే కొనసాగుతా. ప్రస్తుతం నా మనసంతా భావోద్వేగాలతోనే నిండిపోయింది. అయినప్పటికీ ప్రశాంతంగా అనిపిస్తోంది. నా జట్టు మంచి స్థితిలో ఉందని నమ్ముతున్నా. ప్రతిభ, వ్యక్తిత్వం, నమ్మకం, ఉజ్వల భవిష్యత్తు ఉన్న జట్టును ఇప్పుడు చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని హర్మన్ వెల్లడించింది.


కొత్త పేజీ తిప్పే సమయం వచ్చింది..

Harman.jpg

భారత మహిళల క్రికెట్‌కు నాయకత్వం వహించే అవకాశం తనకు దక్కడం గర్వకారణమని హర్మన్‌ప్రీత్‌ తెలిపింది. ‘నా బాధ్యతను నేను నిర్వర్తించానని భావిస్తున్నాను. జట్టుకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను. గర్వంగా బాధ్యతను మోశాను. ఇక కొత్త పేజీ తిప్పే సమయం వచ్చింది. కెప్టెన్సీ ముగిసినా భారత క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ మారదు. కెప్టెన్సీకి వీడ్కోలు పలికా.. ఇక భారత జట్టులో ఒక ప్లేయర్‌గా నా ప్రయాణం కొనసాగుతుంది. నా సహచర ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్, బీసీసీఐ, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

Updated Date - Oct 06 , 2026 | 11:26 AM