చిన్నబోతున్న బొడ్డెమ్మ..
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:48 PM
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై పూలజాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు.
జిల్లాలో మొదలైన బొడ్డెమ్మ సంబురాలు
10నుంచి ఎంగిలిపూల బతుకమ్మ..
18న పెద్ద బతుకమ్మ
ఆడపడుచులు పుట్టింటికి వచ్చేవేళ..
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై పూలజాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ ముందుకు వస్తుంది. పెత్రమాస నుంచి ఎంగిలిపూల బతు కమ్మ మొదలవుతే అంతకంటే ఐదురోజుల ముందు ఇళ్ల వద్దే పిల్లలు, యువతులు ఆడుకునే బొడ్డెమ్మ అటాపాట వినిపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల ముందు, మరికొన్ని ప్రాంతాల్లో ఏడు, ఐదు రోజుల నుంచి మొదలయ్యే బొడ్డెమ్మ పండుగ క్రమంగా కనుమరుగవుతోంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గుర్తిం చినా బొడ్డెమ్మను గుర్తించకపోవడంతో చిన్నబోతోంది. ఈ నేపథ్యంలోనే బొడ్డెమ్మ సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. సోమవారం సిరిసిల్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో బొడ్డెమ్మ సంస్కృతిని పదిలంగానే ఉంచుతూ బొడ్డెమ్మ పండుగ ప్రారంభించుకున్నారు.
బొడ్డెమ్మా బొడ్డెమ్మా.. బిడ్డలు ఎందరే..
బొడ్డెమ్మా బొడ్డెమ్మా కోల్... బొడ్డెమ్మా బొడ్డెమ్మా బిడ్డలు ఎందరే.. అంటూ చిన్నారులు ప్రధానంగా బొడ్డెమ్మ ఆటలు ఆడుకుంటారు. బొడ్డెమ్మ అనే పదా న్ని అమ్మవారి నామాలలో ఒకనామంగా గుర్తించి, పుట్టమన్నుతో చిన్నపిల్లలు, కన్నెపిల్లలు కలిసి ఒక పీఠపైన ఎర్రమట్టితో అంతస్తులుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారుచేస్తారు. బొడ్డెమ్మలను ఐదు రకాలు గా పిలుస్తారు. పీఠ బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పంది రి బొడ్డెమ్మ, బాయిబొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ.. ఇలా వివిధ రకాలుగా తయారుచేసి అందంగా అలం కరిస్తారు. పీట మీద తయారుచేసి మట్టిపైనా శిఖ రంగా బీరపువ్వు, కట్లపూలు, గన్నేరుపూలు, నంది వర్ధనం వంటి పూలతో బొడ్డెమ్మ తయారుచేస్తారు.
ప్రతిరోజు అలికి అలంకరించి రోజు ఆటలు ఆడి తొమ్మిది రోజుల పాటు ఇళ్లలోనే ఉంచి చివరి రోజు చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం అలంకరించి.. దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ... బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతారు. బొడ్డెమ్మ పాటల్లో చందమామను కలు పుతూ... పాడుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. బొడ్డె మ్మ తరువాత వచ్చే అమావాస్య నుంచి మహిళలు బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. బొడ్డెమ్మ సంబురాల తరువాత మరుసటి రోజు పెత్ర అమ వాస్య నుంచి చిన్న బతుకమ్మ సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి అక్టోబరు 10న బతుకమ్మ మొదలు కానుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా పేరుస్తారు.
ఆరోజు నువ్వు లు, బెల్లం, మొక్కజొన్న పేలాలు. 11న అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం. 12న రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బెల్లం, పాలతో ప్రసాదం. 13న నానబియ్యం బతుకమ్మ. నానిన బియ్యం, పాలలో నానబెట్టిన బియ్యంపిండితో బెల్లం కలిపి ప్రసాదం చేస్తారు. 14న అట్ల బతుకమ్మ. బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్లు ప్రసాదంగా తీసుకెళ్తారు. 15న అలిగిన బతుకమ్మ. కొన్నిచోట్ల బతుకమ్మను పేర్చడం, ఆడడం చేయరు. ఆరోజు బతుకమ్మ అలిగిందని అతివలు విశ్వసిస్తారు.
ఒకవేళ బతుకమ్మ ఆడినా ప్రసాదం ఏమి చేయరు. 16న వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దలా చేసి నూనెలో వేయించి ప్రసాదం చేస్తారు. పప్పు బెల్లం కూడా తయారుచేస్తారు. 17న వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న బెల్లం, నెయ్యితో చేసిన ఫలహారం. 18న పెద్ద బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చి ఫలహారాలతో సాగనంపుతారు. చివరిరోజు సద్దుల బతుకమ్మగా పిండి వంటలతో ఉత్సాహంగా గడుపుతారు. రకరకాల పిండి వంటలతో పోటీ పడతారు. ఇంటిల్లిపాది బతుకమ్మను సాగనంపుతారు.
తంగేడు పువ్వు ముచ్చట్లు... గునుగు పువ్వు సంబ రాల మధ్య ఆడపడుచులు పుట్టింటికి తరలివచ్చే ఆనందోత్సాహం. తెలంగాణ జిల్లాల్లో ఆడపడుచు లందరు బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తారు. బతుకమ్మ పండుగ అంటే మహి ళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడు చులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరు వైపులా.. పసుపు పారబోయిసినట్లుగా తంగేడు.. ఏ దిక్కున చూసినా పలకరించే కట్లపూలు, ప్రతి ఇంటి గడప ముందు కనిపించే మందారాలు, తలుపు సందుల్లో తొంగిచూసే గన్నేరు..
నేలంతా పరుచుకునే గుమ్మడి ఇలా.. తీరొక్క రంగుల పూలతో ఆడపడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. బతుకమ్మను ఆది శక్తిగా పల్లెపల్లెలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడ పడుచులు జరుపుకుంటూనే ఉంటారు. దసరా నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మను మహిళలు తొమ్మిది రోజులపాటు జరుపుకుంటే.. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయళ్లలోంచి సేకరించి తీసుకొ స్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. ఇలా చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు ధరించి గౌరి దేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద ఆడపడుచులు బతుకమ్మ ఆడుతారు.
చీకటి పడుతున్న వేళ ఊరి శివారులోని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళు తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయాల్లో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. పడిపంటలను ఉయ్యాలో... సల్లంగా సూడమ్మ ఉయ్యాల్లో... అంటూ సాగిన బతుకమ్మకు శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో... చేయగోరితినమ్మ ఉయ్యాలో... జలజాక్షి పన్నీరు ఉయ్యాలో... జలకంబులా డంగ ఉయ్యాలో.. సారపలుకుల పప్పుఉయ్యా లో..నోరు తేలంబులు ఉయ్యాలో...నీతిరో నికిక ఉయ్యాలో..నిదురబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మా.. నిద్రకు నూరేళ్లు.. నీకు వెయ్యేళ్లు.. పాలిచ్చే తల్లికి వెయ్యేళ్లు... నినుగన్న తల్లికి నిండా వెయ్యేళ్లు అంటూ... పెద్ద బతుకమ్మకు వీడ్కో లు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడపడుచులు పల్లెంలో తెచ్చిన నీటితో వాయినమ్మ వాయిన మ్మ అంటూ వాయినాలు ఇచ్చుకుంటారు.
బొడ్డెమ్మ పాట...
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. నీ బిడ్డ పేరేమీ కోల్
నీ బిడ్డ పేరు నీలగౌరు కోల్.. నిచ్చమల్ల చెట్టేసి కోల్
నిచ్చమల్ల చెట్టుకు కోల్.. రోజు నీళ్లు పోసి కోల్
కాయళ్లు పిందె ళ్లు కోల్.. ఘనమైన కాతకాసే కోల్
కాయలన్ని తెంపి కోల్.. కడవల్లో పోసి కోల్
పిందెలన్ని తెంపి కోల్.. బిందెల్లో పోసి కల్
పండ్లన్ని తెంపి కోల్.. బండ్లల్లో పోసి కోల్
అందులోని పండు తీసి కోల్.. ఢిల్లీకి పంపించి కోల్
ఢిల్లీ డీప రాజు కోల్.. మేడొకటి కట్టించే కోల్
మేడలో ఉన్నది కోల్.. మేలు శ్రీగౌరి కోల్
మేలుశ్రీగౌరికి కోల్.. ఏమేమీ నగలు కోల్
పెసరకాయ బెబ్బర్లు కోల్.. ఒంటినిండా సొమ్ము కోల్
కందికాయ బెబ్బర్లు కోల్.. కాళ్లకు కడియాలు కోల్
అన్ని సొమ్ములు పెట్టి కోల్..అద్దంలో చూసే కోల్
ఈ వార్తలు కూడా చదవండి:
నేను జగిత్యాల ‘మంచినీళ్ల బావి’ని..
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News