భారత రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:04 PM
దేశ రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌కు సూర్యగా నామకరణం చేసిన శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
విశాఖపట్నం, అక్టోబర్ 6: దేశ రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు(మంగళవారం) హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్(FSS-1)కు ‘సూర్య’గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి నౌకాయాన, నౌకల ద్వారా వ్యాపారం కొనసాగిందని గుర్తుచేశారు. హిందూస్థాన్ షిప్ యార్డ్.. మారిటైమ్ కాస్టోడియన్‌గా ఉంటుందన్నారు. జల ఉష నౌక తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల నిర్మాణం వరకు హెచ్‌ఎస్‌ఎల్ పయనం గొప్పదని కొనియాడారు. 2025లో హెచ్‌ఎస్‌ఎల్‌కు ‘మినీ రత్న’ హోదా వచ్చిందన్నారు.
సముద్ర సంబంధిత నియమ నిబంధనలను అనుసరిస్తూ దేశ రక్షణతో పాటు ప్రపంచ సముద్ర జలాలను పరిరక్షిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ కేవలం నౌకల నిర్మాణ సంస్థ మాత్రమే కాదని.. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే మార్గమని అన్నారు. 26 ఏళ్ల క్రితం రవాణా మంత్రిగా హెచ్‌ఎస్‌ఎల్ కోసం విశాఖకు వచ్చానని.. ఇప్పుడు రక్షణ మంత్రిగా హెచ్‌ఎస్‌ఎల్‌కు వచ్చానని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మరింత నమ్మకం వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ రంగానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు సహకారం బాగుందని కొనియాడారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.
కాగా.. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యుద్ధ నౌకలకు సముద్రంలో ఇంధనం, సామగ్రి, ఆహార పదార్థాలను ఫ్లీట్ సపోర్ట్ షిప్ సరఫరా చేయనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, నేవీ, షిప్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం: కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం
Read Latest AP News And Telugu News