బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:12 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేస్తామని జగన్ మాట తప్పారని విమర్శించారు.
విజయవాడ, అక్టోబర్ 6: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేస్తామని జగన్ మాట తప్పారని విమర్శించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నవంబర్ కల్లా ఎన్నికలు జరగకుంటే వందలకోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని.. అయినా ఓటమి భయంతో జగన్ ఈ ఎన్నికలు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు జగన్.. ఫ్యాన్ గుర్తు తీసి గొడ్డలి గుర్తును పార్టీకి పెట్టుకోవాలన్నారు.
‘మీరే చంపేస్తారు... నిందలు మాత్రం మా మీద వేస్తారు. ఐదేళ్ల మీ ప్రభుత్వంలో బీసీలకు ఏవిధంగా న్యాయం చేశారో జగన్ చెప్పాలి. జగన్ బీసీల ద్రోహి.. ఆయన చేసిన అన్యాయాలను రాష్ట్రం మొత్తం తిరిగి చెబుతాం’ అని బుద్దా వెంకన్న తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఎంతో న్యాయం జరిగిందని అన్నారు. ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యం ద్వారా కోట్ల ఆస్తి పేదలకు అందించారన్నారు. కూటమి చేస్తున్న మంచి పనులు చూసి జగన్ తట్టుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక సమావేశం పెట్టి.. వైసీపీ నాయకులపై జగన్ ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అభ్యర్థులు లేక పోటీ కూడా చేయలేని స్థితిలో వైసీపీ ఉందన్నారు. గొడ్డలి పార్టీ మనుగడలో ఉందని చెప్పుకోవడానికి జగన్ ఆరాట పడుతున్నారని.. అందుకే పోటీకి నిలబట్టలేకపోతే ఎమ్మెల్యే సీటు ఉండదని హెచ్చరిస్తున్నారన్నారు.
వైసీపీలో పోటీ చేసే వారే లేరని ఆ నేతలే చెబుతున్నారని.. ఆ భయంతో ఎన్నికలు జరగకుండా ఉండేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. కోర్టులను అడ్డం పెట్టుకుని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలే చివరి ఎన్నకలని జగన్‌కు కూడా తెలుసన్నారు. అందుకే అడ్డదారుల్లో అయినా ఎన్నికలను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘నువ్వు బీసీల జోలికి వస్తే... మా సత్తా చూపిస్తాం జగన్’ అంటూ హెచ్చరించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికి ప్రచారం కోసం వెళ్లలేదని.. కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను బతిమాలుకునేందుకు వెళుతున్నారని అన్నారు. పోలీసు యంత్రాంగం బాగా పని చేస్తుంది కాబట్టే వైసీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చి రంకెలు వేస్తున్నారన్నారు. పోలీసులు పనిచేయకపోతే... వైసీపీ వాళ్లకు రోడ్లపైకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. అసలు గొడ్డలి పార్టీకి పోలీసుల గురించి మాట్లాడే అర్హత లేదని బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: మంత్రి మండిపల్లి
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ
Read Latest AP News And Telugu News