Share News

సీఎంఆర్‌ఎఫ్‌ నిబంధనలు కఠినతరం..

ABN , Publish Date - May 29 , 2026 | 11:58 AM

ఊహించని విధంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు అత్యవసర వైద్యచికిత్సలు చేయడం చాలా ఖరీదుగా మారుతుంటాయి.

సీఎంఆర్‌ఎఫ్‌ నిబంధనలు కఠినతరం..
TG Govt, CMRF

  • ఇక మంత్రుల సిఫార్సులు చెల్లవు

  • మంజూరు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే

  • చెక్కుల సవరణలో మ్యానువల్‌కు చెక్‌

  • వివరాలు పక్కాగా ఉండాలి

  • తాజా మార్గదర్శకాలను జారీ చేసిన సర్కార్‌

హనుమకొండ: ఊహించని విధంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు అత్యవసర వైద్యచికిత్సలు చేయడం చాలా ఖరీదుగా మారుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతారు. ఇలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటుచేసి సాయం అందిస్తోంది. వైద్య అత్యవసర పరిస్థితులలో బాధితులకు తాను అండగా ఉన్నానని ప్రభుత్వం చెప్పుకుంటోంది.


దుర్వినియోగానికి చెక్‌

ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతున్నట్లు, సహాయనిధి బాధితులకు అందడంలో జాప్యం జరుగుతున్నట్టు, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం నుంచి ఈ సీఎంఆర్‌ఎఫ్‌ పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మంత్రులు ఇతర నియోజకవర్గాల పరిధిలోని బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‏ను సిఫార్సు చేయడం వల్ల స్థానిక ఎమ్మెల్యే ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది.


ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొత్త మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి చేసింది. తాజాగా ఆన్‌లైన్‌ దరఖాస్తు విషయంలోనూ కొన్ని మార్పులను చేసింది. నిధులదుర్వినియోగాన్ని అడ్డుకుని పారదర్శకతను పెంపొందించేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈమేరకు ప్రభుత్వంతాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో సీఎంఆర్‌ఎఫ్‌ కింద అర్హులను ఎంపిక చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


మంత్రుల సిఫార్సులు చెల్లవు

మంత్రులు ఇక నుంచి ఇతర నియోజకవర్గాలకు చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సిఫార్సు చేయడం కుదరదు. జిల్లాలోని ఏ నియోజకవర్గానికి చెందిన వారికైనా మంత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేసే అవకాశం ఇప్పటి వరకు ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకా రం ఆవిధానం మారింది. మంత్రులు లేదా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ పరిధిలో నివసించే అభ్యర్ధులకు మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు సాఫ్ట్‌వేర్‌లో కూడా అభ్యర్థి చిరునామా ఆధారంగానే సిఫార్సు చేసేలా మార్పులు చేశారు. ఈ కొత్త విధానం వల్ల అనర్హుల దరఖాస్తులకు అడ్డుకట్టపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


CMRF1.jpgఅంతా ఆన్‌లైన్‌

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్లో ఏవైనా తప్పులు దొర్లితే గతంలో మాన్యువల్‌ విధానం అమల్లో ఉండేది. ఇకపై మార్పుల ప్రక్రియను పూర్తిగా ప్రజాప్రతినిధుల లాగిన్‌కు అనుసంధానించారు. లబ్ధిదారులు తమ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయాన్ని ఆశ్రయిస్తే అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌ ద్వారా రెవెన్యూ విభాగానికి దరఖాస్తు పంపిస్తారు. అనంతరం కొత్త చెక్కు నేరుగా ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుతుంది.


పక్కాగా వివరాలు

నిరుపేదల కోసం ప్రభుత్వం అందించే ముఖ్యమైన ఆర్థిక సహాయం కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం.. వివరాలన్నీ పక్కాగా ఇవ్వాలని సూచించింది. దరఖాస్తుదారులు ఇచ్చేవివరాల్లో తప్పులు దొర్లితే ఆర్థిక సాయం అందడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెల్‌ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడం, ఆధార్‌ సంఖ్య నమోదులో తప్పులు, వాస్తవ ధ్రువపత్రాలు సకాలంలో సమర్పించకపోవడం వంటి కారణాలతో చెక్కులు లబ్ధిదారులకు సకాలంలో చేరడం లేదని ప్రభుత్వం గుర్తించింది. వివరాల న్నీ పక్కాగా ఉండేలా చూడాలని పేర్కొన్నది. ఫిజికల్‌ డాక్యుమెంట్లు సమయానికి సమర్పించకపోవడం వంటి అనేక తప్పిదాలు జరుగుతున్నాయని వీటన్నిటినీ సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులకు సూచించింది.


దరఖాస్తు ఇలా..

ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులు, హాస్పిటల్‌ డిశ్చార్జ్‌ సమ్మరీ, చికిత్స ఆంచనా కాగితాలు, లబ్ధిదారుడి బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌, నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సంతకంచేసిన సిఫార్సు లేఖ తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్‌, ఫొటో, ఫోన్‌ నెంబర్‌ అందజేయాలి.


రెండు రకాలుగా సాయం

సీఎంఆర్‌ఎఫ్‌ సాయాన్ని ప్రభుత్వం రెండు రకాలుగా అందజేస్తోంది. నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ముందుగా చెల్లింపులు అవసరం లేకుండా ప్రభుత్వం లేఖ ఇస్తోంది. ఈ లేఖలో మంజూరు చేసిన నగదును చెల్లించకుండానే రోగి చికిత్స పొందవచ్చు. ఇక ఏదైనా ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగి బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత అందులో కొంత భాగా న్ని తిరిగి ఇవ్వాలని ఈ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీలు డీలా.. కేడర్‌ గోల..!

పిల్లల కిడ్నీలో రాళ్లు !

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 12:13 PM