ఇంట్లో పేలిన ఏసీ.. మాజీ ఐఏఎస్ కన్నుమూత
ABN , Publish Date - May 29 , 2026 | 10:00 AM
ఇంట్లో ఏసీ పేలడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఏసీ పేలడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్రకుమార్ మృతి చెందారు. ఏసీ పేలి మంటలు చెలరేగడంతో పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, బుధవారం రాత్రి 11.10 గంటల సమయంలో వారి ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ధనేంద్ర కుమార్, ఆయన కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. మంటలు చెలరేగగానే వారిని కాపాడేందుకు ప్రయత్నించానని ఇంట్లో సహాయకుడిగా చేస్తున్న రమేశ్ పోలీసులకు తెలిపారు.
ఏసీ ఇండోర్ యూనిట్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్స్‌ను కూడా నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ తమకు అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని అన్నారు.
1968 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో కేంద్రంలో పని చేశారు. 2009-11 మధ్య కాలంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్‌గా పనిచేశారు. రక్షణ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు తదితర శాఖల్లో సెక్రటరీగా సేవలందించారు. హర్యానా రాష్ట్రంలో కూడా సేవలందించారు.
ఈ వార్తలనూ చదవండి:
నీట్ పరీక్ష.. ఎయిర్‌ఫోర్స్ సాయం తీసుకునే యోచనలో కేంద్రం!
కర్ణాటకలో ఆ ఘనత సాధించిన సీఎంలు ముగ్గురే..