Share News

నీట్ పరీక్ష.. ఎయిర్‌ఫోర్స్‌ సాయం తీసుకునే యోచనలో కేంద్రం!

ABN , Publish Date - May 28 , 2026 | 09:01 PM

జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల రవాణాకు ఎయిర్‌ఫోర్సు సాయం తీసుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నీట్ పరీక్ష.. ఎయిర్‌ఫోర్స్‌ సాయం తీసుకునే యోచనలో కేంద్రం!
Air Force for NEET papers transport

ఇంటర్నెట్ డెస్క్: పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు చేసిన నీట్ పరీక్షను మరోసారి జూన్ 21న నిర్వహించనున్న కేంద్రం ఈ దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ప్రశ్న పత్రాల తరలింపు కోసం ఎయిర్‌ఫోర్స్‌ను వినియోగించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నీట్ పరీక్ష ఏర్పాట్లకు సంబంధించి గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్, విద్యాశాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయం అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రశ్నపత్రం రూపకల్పన, ప్రింటింగ్, రవాణా, పంపిణీ.. ఇలా పరీక్షకు సంబంధించి ప్రతి దశపై పటిష్ఠ నిఘా పెట్టే విషయమై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.


ఈ ఏడాది నీట్ పరీక్ష‌ను మే 3న 551 నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. 22 లక్షల పైచిలుకు విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. ఆ తరువాత పేపర్ లీక్ అయిన విషయం వెలుగులోకి రావడంతో మే 12న ప్రభుత్వం నీట్‌ పరీక్షను రద్దు చేసింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

కర్ణాటకలో ఆ ఘనత సాధించిన సీఎంలు ముగ్గురే..

హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్

Updated Date - May 28 , 2026 | 09:17 PM