కర్ణాటకలో ఆ ఘనత సాధించిన సీఎంలు ముగ్గురే..
ABN , Publish Date - May 28 , 2026 | 06:43 PM
దశాబ్దాల కర్ణాటక రాజకీయ చరిత్రలో కేవలం ముగ్గురు సీఎంలే పూర్తికాలం పాటు పదవిలో కొనసాగారు. వారెవరంటే..
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డీకే శివకుమార్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన రెండేళ్ల పాటే సీఎం పదవిలో కొనసాగుతారు. అయితే, కర్ణాటకలో ముఖ్యమంత్రులు పదవికాలం పూర్తికాక ముందే తప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1956 నుంచి కర్ణాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకూ కేవలం ముగ్గురే సీఎంగా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగారు.
రెండు సార్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కాంగ్రెస్ నేత ఎస్. నిజలింగప్ప. 1956లో సీఎం అయిన ఆయన ఏడాది పాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత 1962లో మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టి 5 ఏళ్ల 345 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన మరో ముఖ్య నేత దేవరాజ్ ఉర్స్ 1972-77 మధ్య పూర్తికాలం సీఎం పదవిలో ఉన్నారు. ఇక 2013లో తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య పూర్తికాలం పదవిలో ఉన్నారు.
మరోవైపు తక్కువ కాలం సీఎం పదవిలో కొనసాగిన వారిలో యడియూరప్ప ఒకరు. 2007లో అప్పటి బీజేపీ-జేడీఎస్ కూటమి కూలిపోవడంతో ఆయన వారానికే సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1971లో సీఎం బాధ్యతలు చేపట్టిన ఎస్ఆర్ కాంతి కొన్ని వారాల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఇక కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి నేతృత్వం వహించిన ధరమ్ సింగ్ ఏడాదికి పైగా పదవిలో కొనసాగి 2006లో తప్పుకున్నారు. 2012లో సీఎం పదవి చేపట్టిన జగదీశ్ శెట్టర్ 305 రోజుల పాటు పదవిలో కొనసాగారు. అంతర్గత పరిస్థితుల వల్ల సీఎంగా సదానంద గౌడను బీజేపీ తప్పించడంతో జగదీశ్ శెట్టర్‌కు అవకాశం దక్కింది. అసెంబ్లీ గడువు ముగియడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్
రైతుగా మారిన టెకీ.. పిడుగుపాటుకు గురై దుర్మరణం