Share News

పేలిపోయిన న్యూ గ్లెన్ రాకెట్.. ఎక్స్ వేదికగా స్పందించిన బ్లూ ఆరిజిన్..

ABN , Publish Date - May 29 , 2026 | 11:21 AM

అమెరికాలోని కేప్ కెనవరల్‌లో గురువారం నాడు బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ పేలిపోయింది. ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ సంస్థ తెలిపింది.

పేలిపోయిన న్యూ గ్లెన్ రాకెట్.. ఎక్స్ వేదికగా స్పందించిన బ్లూ ఆరిజిన్..
Blue Origin Rocket Explosion

అమెరికా: ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్‌లో గురువారం నాడు బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ పేలిపోయింది. ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ సంస్థ తెలిపింది. హాట్ ఫైర్ పరీక్ష సమయంలో అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నామని.. సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారని ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.


న్యూ గ్లెన్ రాకెట్ లాంచింగ్‌కు సిద్ధంగా ఉండగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అయితే, ఆకాశంలోకి దూసుకెళ్లాల్సిన క్షణాలకు ముందే రాకెట్ దిగువ భాగం నుంచి దట్టమైన పొగ వచ్చింది. క్షణాల వ్యవధిలోనే పేలుడు సంభవించి భారీ అగ్నిగోళం ఏర్పడింది. దీంతో ప్రయోగ వేదిక మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఈ ప్రమాదంపై బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పందించారు. 'ఇది చాలా కఠినమైన రోజు. అవసరమైన ప్రతిదాన్ని మళ్లీ నిర్మించి, తిరిగి ప్రయోగాలకు సిద్ధమవుతాం. అంతరిక్ష ప్రయాణం కోసం ఈ ప్రయత్నం విలువైనదే' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.


మరోవైపు ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. న్యూ గ్లెన్ పేలుడుపై ఫ్లోరిడాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు మైక్ హారిడోపోలోస్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.


నాసా, బ్లూ ఆరిజిన్ కలిసి ఆర్టెమిస్ చంద్రయాన్ మిషన్ల కోసం లూనార్ ల్యాండర్ అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. దీంతో ప్రమాదంపై నాసా కూడా దర్యాప్తును పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పేలుడుతో బ్లూ ఆరిజిన్ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భవిష్యత్ అంతరిక్ష వాణిజ్యం, చంద్రయాన్ మిషన్లలో న్యూ గ్లెన్ రాకెట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రణాళికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మరో అమెరికా విమానం కూల్చివేత.. ఇరాన్ మీడియాలో కథనం

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

Updated Date - May 29 , 2026 | 11:44 AM