Share News

అంగట్లో ‘డబుల్‌ బెడ్‌రూం’లు

ABN , Publish Date - May 29 , 2026 | 11:03 AM

ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్‌రూం ప్రాజెక్టుగా పేరుగాంచిన పటాన్‌చెరు సర్కిల్‌, తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని కొల్లూరులో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్ల విక్రయాల దందా జోరుగా సాగుతోంది.

అంగట్లో ‘డబుల్‌ బెడ్‌రూం’లు
Double Bedroom Flats

  • నిరుపేదలే లక్ష్యంగా కొల్లూరులో దందా

  • నోటరీల ద్వారా లబ్ధిదారుల వద్ద కొనుగోళ్లు

  • రూ. 6 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు బేరాలు

  • నాయకుల అనుచరులమని బెదిరింపులు, ప్రలోభాలు

రామచంద్రాపురం(సంగారెడ్డి): ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్‌రూం ప్రాజెక్టుగా పేరుగాంచిన పటాన్‌చెరు సర్కిల్‌, తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని కొల్లూరులో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్ల విక్రయాల దందా జోరుగా సాగుతోంది. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన ఈ ఇళ్లను, కొందరు వ్యక్తులు నోటరీల ద్వారా అక్రమంగా క్రయవిక్రయాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


అమ్మకాలు నిషిద్ధమైనా..

హైదరాబాద్‌ పట్టణంలోని వివిధ డివిజన్ల పరిధిలో నివసించే పేదలకు ప్రభుత్వం ఇక్కడ 15,650 డబుల్‌బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చింది. కంప్యూటరైజ్డ్‌ లక్కీడ్రా పద్ధతిలో 2023లో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. వీటిని ఇతరులకు బదలాయించడం, అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషిద్ధం. కానీ, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఇళ్లు పొందినవారిలో కొందరు వృత్తి, వ్యాపారాల రీత్యా ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు.


తాము నివసించేందుకు అవకాశం లేకపోవడంతో ఫ్లాట్లను అమ్మకానికి పెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు అటువంటి వారిని సంప్రదించి ఫ్లాట్లను విక్రయించేలా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఫ్లాట్‌, బ్లాక్‌ నంబర్‌తో సహా సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. రూ. 6 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు బేరాలు కుదుర్చుకుంటున్నాయి. నోటరీపై ఒప్పందం రాసుకుని ఫ్లాట్లను విక్రయిస్తున్నారు.


rcpur1.jpgబ్లాక్‌ అడ్మిన్లే కీలక పాత్ర

కొల్లూరు ఫేజ్‌-2లో ఉన్న బ్లాకులకు అడ్మిన్లుగా ఉన్న కొందరు వ్యక్తులే ఈ క్రయవిక్రయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు, అనారోగ్య సమస్యలు, పెళ్లిళ్లు వంటి అవసరాల్లో ఉన్న లబ్ధిదారులను గుర్తించి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తాము స్థానిక నాయకుల అనుచరులమని చెబుతూ, కొందరు బ్రోకర్లు ఈ దందా నడుపుతున్నారు. సుమారు 50 నుంచి 70 బ్లాకుల్లో ఫ్లాట్ల అమ్మకాల ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా 46,57,63,66 తదితర బ్లాకుల్లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది.


తనిఖీల్లో లోపాలు

జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులు తరచూ లబ్ధిదారులు కేటాయించిన ఫ్లాట్లలో నివసిస్తున్నారో లేదో తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ తనిఖీల సమాచారం ముందే లబ్ధిదారులకు అందుతోంది. దీంతో, అధికారులు వచ్చే రోజున మాత్రం లబ్ధిదారులు స్వయంగా ప్రత్యక్షమై ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతుండటంతో అక్రమాలు బయటపడటం లేదు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, అమ్మకానికి గురైన లేదా అద్దెకు ఇచ్చిన ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో డబుల్‌ బెడ్‌రూం పథకం లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీలు డీలా.. కేడర్‌ గోల..!

పిల్లల కిడ్నీలో రాళ్లు !

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 11:13 AM