Share News

ఆర్టీసీపై ‘డీజిల్‌’ పిడుగు!

ABN , Publish Date - May 29 , 2026 | 05:01 AM

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పిడుగులా పడుతున్నాయి. ఇంధన కంపెనీలు వారం రోజుల్లోనే నాలుగు సార్లు....

ఆర్టీసీపై ‘డీజిల్‌’ పిడుగు!

  • వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు

  • రోజూ 7.60లక్షల లీటర్ల డీజిల్‌ వాడకం

  • వరుస పెంపుతో రూ.8 పెరిగిన ధర

  • రోజుకు రూ.60లక్షల అదనపు భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పిడుగులా పడుతున్నాయి. ఇంధన కంపెనీలు వారం రోజుల్లోనే నాలుగు సార్లు పెంచిన పెట్రో ధరల ప్రభావం వలన, మన ఆర్టీసీపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. ప్రతి రోజూ సగటున 38 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులు.. సరాసరి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే లీటరు డీజిల్‌ తాగేస్తున్నాయి. ఆ లెక్కన ఏపీఎ్‌సఆర్టీసీ ప్రతి రోజూ 7.60 లక్షల లీటర్ల డీజిల్‌ వాడుతోంది. వారం క్రితం వరకూ ఆర్టీసీకి సబ్సిడీ ప్రాతిపదికన విక్రయించే డీజిల్‌ లీటరు ధర రూ.87.72గా ఉండేంది. ధరలు పెంచడంతో మే 25 నాటికి ఇది ఏకంగా రూ.95.61కు ఎగబాకింది. దీంతో ఆర్టీసీపై ప్రతి లీటరుకు రూ.7.89 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన ప్రతి రోజూ 7.60 లీటర్ల వినియోగానికి రూ.60 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ధరలు మరింత పెరిగితే..!

కాలం చెల్లిన బస్సులు, భారీగా పెరిగిన ప్రయాణికులతో సరైన సేవలందించలేక ఆర్టీసీ ఇప్పటికే ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికి పెరిగిన ధరల వరకు చూస్తే, ఆర్టీసీపై నెలకు రూ.18 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే తమకు వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్‌ కంపెనీలు ఇంధన ధరలను రానున్న రోజుల్లోనూ మరింత పెంచుకుంటూ పోతే.. పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు. డీజిల్‌ ధరలు ఇదే వేగంతో లీటరుకు రూ.10 పైన పెరిగితే ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని ఓ అధికారి అన్నారు.

ఓవర్‌ లోడ్‌తో బస్సులు నడపలేం..

ఆర్టీసీలో సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు సుమారు 2700 ఉన్నాయి. వాటికి ఐదు కి.మీ. ప్రయాణానికి ఒక లీటరు డీజిల్‌ను ఆర్టీసీ ఇస్తోంది. వేసవి సెలవులు, స్ర్తీశక్తి ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. బస్సులను ఓవర్‌ లోడ్‌తో తిప్పాల్సి వస్తోందని, లీటర్‌ డీజిల్‌ మైలేజ్‌ 5 కి.మీ. రావడం లేదని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 100 లీటర్ల డీజిల్‌తో ఎంత దూరం తిప్పామో.. ఇప్పుడు అంతే దూరానికి 130 లీటర్లు పోయించాల్సి వస్తోందంటున్నారు. అద్దెలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాదంటే సర్వీసులు ఆపేస్తామని చెబుతున్నారు.

Updated Date - May 29 , 2026 | 05:01 AM