Share News

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:47 AM

సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రజాబలం అని కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.

సంక్రాంతి తర్వాత ప్రజాబలం
Revanth Reddy

  • గ్రామాల్లో పర్యటిస్తా... అన్ని జిల్లాలు తిరుగుతా

  • ప్రజల్లోకి వెళ్లి సమస్యలు నేరుగా తెలుసుకుంటా

  • ఎల్‌నినో కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం

  • యాసంగిలో రైతులు ఆరుతడి పంటలే వేయాలి

  • కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఇవ్వలేని దుస్థితి

  • కేసీఆర్‌ కుటుంబం కమీషన్ల కక్కుర్తే కారణం

  • రూ.10 వేల కోట్లతో కొడంగల్‌లో పనులు

  • గడ్డం పెంచుకుంటే కేటీఆర్‌ రేవంత్‌ కాలేడు

  • తండ్రి అయినా కొడుకును మందలించాల్సింది

  • కాళేశ్వరంలో దొరికిపోయి మోదీకి మోకరిల్లారు

  • లగచర్ల రైతు మేళాలో రేవంత్‌రెడ్డి ప్రసంగం

వికారాబాద్‌ ప్రతినిధి/కొడంగల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రజాబలం అని కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటామని చెప్పారు. కరువు పరిస్థితులు ఏర్సడితే ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ప్రజాప్రతినిధి ప్రజల మధ్య ఉండాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా, కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలం లగచర్ల-హకీంపేట హబ్‌లో మూడు రోజుల పాటు కొనసాగనున్న మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అందరం కలిసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరి పోతాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండిపోతాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


రైతులు ఆరుతడి పంటలు వేయాలని, వేరే పంటలు వేస్తే పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని చెప్పారు. అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకుని ఆధునిక సాగు పద్ధతులు పాటించాలన్నారు. తాండూరు కందిపప్పుకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని, తాండూరు, కొడంగల్‌, పరిగి ప్రాంతాల జొన్నలు, సజ్జలు, కందులు, జొన్న రొట్టెలకు ప్రత్యేకత ఉందని, రైతులు అనుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. ఎల్‌నినోపై బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొంటే ఒక్క తెలంగాణలోనే వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘బావబామ్మర్దులు ఊర్ల మీద పడి అబద్ధాలు, అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మితే మట్టిపోసి అంబలి కాచుకున్నట్లే‘‘ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్ల పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడడం వల్లే కరువు సమయంలో కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఇవ్వలేని దుర్భర పరిస్థితి ఏర్పడిందని సీఎం ఆరోపించారు.


TG copy.jpgకేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామన్నా లెక్కచేయకుండా కేసీఆర్‌ ప్రాణహిత-చేవెళ్లను పక్కనబెట్టి, పేరు, ప్రాంతం, అంచనాలు మార్చి కాళేశ్వరం కట్టారన్నారు. ‘‘కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలింది వాళ్ల హయాంలోనే‘‘ అన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా లేదని, అన్నారం, సుందిళ్ల వద్దా లేదని, మరి ఈ బ్యారేజీలు గాడిదలు కాయడానికి కట్టారా అని ప్రశ్నించారు. మూడు బ్యారేజీల్లో గేట్లు దించి, మూడు పంప్‌హౌస్‌లు ఏకకాలంలో పనిచేస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి నిండుతుందని, మేడిగడ్డలో 16 టీఎంసీలు ఉంటేనే కన్నెపల్లి నుంచి ఎత్తిపోయగలమని వివరించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోయక పోవడం వల్లే నీళ్లు ఏపీకి పోతున్నాయన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలు అబద్ధమని, ఆ పార్టీ నేతలకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆనాడు ‘కాళేశ్వర్‌రావు‘గా పొగిడించుకున్న హరీశ్‌రావు ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన తుపాకులగూడెం-దేవాదుల, జలయజ్ఞంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన రాజీవ్‌సాగర్‌ (ఇప్పటి సీతారామ) ప్రాజెక్టులే ఇప్పుడు లక్షల ఎకరాలకు నీరిస్తూ ఖమ్మం జిల్లా రైతులను ఆదుకుంటున్నాయని చెప్పారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశిస్తే, సీబీఐ విచారణ జాప్యం కోసం ఢిల్లీలో మోదీ ముందు మోకరిల్లింది మీరు కాదా అని బీఆర్‌ఎ్‌సను నిలదీశారు. పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.20 లక్షల కోట్లకు పైగా ఉన్నా పాలమూరులో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, అచ్చంపేట ఎత్తిపోతలు పూర్తిచేసి ఉంటే నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు.


22ఏపై అసెంబ్లీలో చర్చకు రండి

22ఏ భూములపై కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసెంబ్లీలో చర్చకు వస్తే వాస్తవాలన్నీ ప్రజల ముందుంచుతామని సీఎం సవాల్‌ విసిరారు. డిసెంబరులో రెండు మూడు రోజుల పాటు ఎల్‌నినో, కాళేశ్వరం, ప్రాణహిత నీళ్లపై చర్చకు అవకాశం ఇవ్వాలని వేదికపై ఉన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. చర్చకు కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ తమ తాతముత్తాతలను, చుట్టాలను వెంటబెట్టుకుని వచ్చినా అనుమతించాలని, అసెంబ్లీలోనే వాళ్ల సంగతి తేలుస్తామని అన్నారు.

గడ్డం పెంచితే రేవంత్‌ కాలేవు

కేటీఆర్‌పై సీఎం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కన్సల్టెంట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్లో సమావేశం పెడితే ‘ఆ సార్‌కు గడ్డం ఉంది, నీకు లేదు‘ అని చెప్పారని, అందుకే ఇప్పుడు గడ్డం పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క కథ చెప్పి.. ‘‘పది జన్మలెత్తినా నువ్వు తారకరామారావువే గానీ రేవంత్‌రెడ్డివి కాలేవు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే ధైర్యం, నమ్మినవారి కోసం నిలబడే తత్వం ఉంటేనే రేవంత్‌రెడ్డి అవుతారు‘‘ అన్నారు. ఈ చిల్లర వేషాలేంటని కొడుకును కేసీఆర్‌ మందలించాలని సూచించారు. పదేళ్లలో ఇంటిల్లిపాదీ తెలంగాణను దోచుకుని లక్ష కోట్లు సంపాదించుకున్నారని, పీకల దాకా పాతిపెడితేనే వాళ్ల పాపాలు పోతాయని విమర్శించారు. ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని, వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్‌ తన ఫామ్‌హౌ్‌సలో వందల ఎకరాల్లో వరి పండించుకోలేదా అని ప్రశ్నించారు.


TG copy.jpgకొడంగల్‌కు కేసీఆర్‌ ద్రోహం

2009లో పాలమూరు ప్రజలు విఠల్‌రావును కాదని కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపారని, కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, పాలమూరు-రంగారెడ్డి, మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని సీఎం విమర్శించారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌, టేకుల్‌కోడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ, మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలను అడ్డుకున్నది బీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.2 లక్షలు కూడా ఇవ్వలేదని, మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి భూసేకరణ పూర్తి చేశామని, ఇప్పుడు ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనిచేసిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్లీ అంత పెద్ద అవకాశం ఇప్పుడే దక్కిందని, దాన్ని ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పారు.


దేశానికే తలమానికంగా కొడంగల్‌

ఢిల్లీ-నోయిడా, ముంబై-పుణె తరహాలో హైదరాబాద్‌-లగచర్ల మధ్య పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, రూ.10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నామని సీఎం తెలిపారు. కొడంగల్‌ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి గంటలో చేరుకునేలా 250 అడుగుల వెడల్పుతో 80 కిలోమీటర్ల కొత్త రహదారికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. లగచర్ల భూముల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించినా, అభివృద్ధిని చూసి అదే రైతులు భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. 943.34 ఎకరాల కొడంగల్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లో భూసేకరణకు రూ.220 కోట్లు, రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులకు రూ.441.91 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.


TG copy.jpgబిర్లాను లిమిటెడ్‌ ఫైబర్‌ సిమెంట్‌ బోర్డుల పరిశ్రమకు, ఈకో బామ్‌ ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌ సంస్థ వెజిటబుల్‌ ఆయిల్స్‌ పరిశోధన యూనిట్‌కు కలిపి 96 ఎకరాలు కేటాయించామని, రూ.252.86 కోట్ల పెట్టుబడితో 535 ఉద్యోగాలు రానున్నాయని వివరించారు. ‘‘మీకంటే నాకు ఆత్మ బంధువులు లేరు. పదేళ్లు రాజకీయాలకతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా‘‘ అన్నారు. అందరికీ ఆదివారం దీపావళి అయితే కొడంగల్‌కు ఒకరోజు ముందే వచ్చిందన్నారు. రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, వంశీకృష్ణ, గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లగచర్లలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీతో రైతులకు మేలు: స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. లగచర్లలో ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఆయిల్‌పామ్‌ రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:04 AM