హోంశాఖను ఓవైసీ బ్రదర్స్‌కు తాకట్టు పెట్టారు.. సీఎం రేవంత్‌పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:39 PM
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు..
కామారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఓడించి రమణారెడ్డి గెలవడం కాంగ్రెస్ కేడర్ జీర్ణించుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
బీజేపీపై కక్ష సాధింపు..
ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకుండా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి, బాన్సువాడ, నాగర్‌కర్నూర్‌లో జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఎమ్మెల్యే రమణారెడ్డిని పరామర్శించడానికే బీజేపీ నాయకులు వస్తుంటే.. హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని ప్రశ్నించారు.
ఓవైసీ బ్రదర్స్ చెప్పినట్లుగా డ్రామాలు..
ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు అధికారంలో ఉండే అర్హత కాంగ్రెస్‌కు లేదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హోంశాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఓవైసీ బ్రదర్స్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. బాన్సువాడలో ఓవైసీ బ్రదర్స్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడిందని దుయ్యబట్టారు. హిందూ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎందుకు రిమాండ్‌కు పంపలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 13 మంది ఆర్ఎస్ఎస్ వాళ్లని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపడం దారుణమని అన్నారు. రైతు బీమాను అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీలో రైతుల కోసం కొట్లాడతామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ కన్నుమూత
మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ
Read Latest Telangana News And AP News And Telugu News