కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ చామల లేఖ.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 23 , 2026 | 08:10 PM
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఢిల్లీ, జనవరి23(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై తక్షణమే స్పందించి ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణకు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు అంశానికే ఈ విచారణను పరిమితం చేయొద్దని కోరారు. సింగరేణిలో గడిచిన పదేళ్లలో జరిగిన అన్ని టెండర్లు, అధికారిక ప్రక్రియలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు.
లేఖలోని ప్రధాన డిమాండ్లు ఇవే..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 2014వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్నిటెండర్లు, కాంట్రాక్టులు, అధికారిక నిర్ణయాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు, ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్ ప్రక్రియలను కూడా ఈ విచారణ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడే దిశగా, గత పదేళ్లుగా టెండర్ల కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే, వాటిని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. సింగరేణి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో పారదర్శకత, ప్రజాహితాన్ని కాపాడటం అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు. కిషన్‌రెడ్డి వెంటనే స్పందించి 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్ల ప్రక్రియలను ఈ ఉన్నత స్థాయి విచారణ బృందం పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News