Share News

బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:23 PM

వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపించారు స్పీకర్.

బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Gaddam Prasad Kumar

వికారాబాద్, జనవరి23(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌కు(Methuku Anand) తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar) లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపిన స్పీకర్.. పలు అంశాలను అందులో ప్రస్తావించారు. ఆనంద్ తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మానసికంగా క్షోభ పెట్టారు..

మానసికంగా క్షోభ పెట్టినందుకు మాజీ ఎమ్మెల్యే రూ.10కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే వారం రోజుల్లో బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టం ప్రకారం.. న్యాయస్థానాల ద్వారా తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మెతుకు ఆనంద్ ఈ ఏడాది జనవరి 14, 19 తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తనపై నిరాధార, తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలతో పాటు చేశారని ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని నోటీసుల్లో వివరించారు స్పీకర్.


బుల్లెట్ రాజు అంటూ అవహేళన..

జనవరి 14న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా తన మనసును గాయపరిచారని సభాపతి ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.


నాపై కట్టు కథలు అల్లారు..

జనవరి 19న మీడియా సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ శాసన వ్యవస్థలో అత్యున్నతమైన శాసన సభాపతి పదవిని అవమానించే విదంగా శాసనసభ్యుల అనర్హత అంశంలో తాను వందల కోట్లు లంచంగా తీసుకున్నానని మెతుకు ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారని ప్రస్తావించారు. ఇది రాజ్యాంగ బద్దమైన పదవిని అవమానించడమేనని చెప్పుకొచ్చారు. అదేవిధంగా వికారాబాద్ పురపాలక సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లారని ఆగ్రహించారు.


నాపై నిరాధార ఆరోపణలు..

ప్రజాస్వామ్యంలో, రాజకీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం కల్పించిందని.. కానీ తనపై నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం అత్యున్నత పదవులను అవమానించడం, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నమేనని గడ్డం ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలను సమాజంతో పాటు న్యాయస్థానాలు కూడా సమర్థించవని స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 499, 500ల ప్రకారం దురుద్ధేశ ఆరోపణలు చేసిన వారు శిక్షార్హులు అవుతారన్నారు.


రూ.10 కోట్ల నష్టపరిహారం..

అట్టడుగు స్థాయి నుంచి వచ్చి శాసన వ్యవస్థలో అత్యున్నతమైన శాసన సభాపతి హోదాలో తాను ఉన్నానని ప్రస్తావించారు గడ్డం ప్రసాద్ కుమార్. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం సహా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తున్నానని తెలిపారు. అలాంటి తనపై అసత్య ఆరోపణలతో తన మనసును క్షోభ పెట్టినందుకు మెతుకు ఆనంద్ రూ.10 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు ఏడు రోజుల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయస్థానాల ద్వారా తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 05:58 PM