Share News

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:06 PM

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

  • ఇళ్ల మధ్యే పందుల స్వైర విహారం

  • రోగాల బారిన పడుతున్న ప్రజలు

  • జాతీయ అవార్డులు పొందిన హుస్నాబాద్‌లో నియంత్రణ కరవు

హుస్నాబాద్‌(సిద్దిపేట): స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి. కోతులు గుంపులు గుంపులుగా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోకి వెళ్లి వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. కుక్కలు పట్టణంలో స్వైర విహారం చేస్తున్నాయి. పందులు ఇళ్లలోకే వస్తున్నాయి. కోతులతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారులో ఉండాల్సిన పందులు జనావాసాల్లోనే సంచరిస్తున్నాయి.


దీంతో రోగాలబారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నియంత్రించకపోవడంతో ఎప్పుడు ఎవరిని కరుస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు హుస్నాబాద్‌ పట్టణం అభివృద్ధి పనులతో ముందుకుపోతుంటే.. మరోవైపు వీటితో ప్రజలు భయకంపితులవుతున్నారు. మున్సిపల్‌ అధికారులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


srd4.2.jpg

నెలకు వంద మందికి పైగానే బాధితులు

హుస్నాబాద్‌ పట్టణంలో కోతులు, కుక్కలు బారినపడి నెలకు దాదాపు 100 మందికి పైగానే ఆసుపత్రిలో చేరుతున్నారు. హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబరులో 136 మంది, డిసెంబరులో 144 మంది, జనవరిలో 195 మంది, ఫిబ్రవరిలో 194 మంది మొత్తం 669 మంది వీటి బారినపడి ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇందులో 350 మందికిపైగా హుస్నాబాద్‌కు చెందినవారు ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.


కోతులను పట్టించేందుకు తీర్మానం చేశాం

పట్టణంలో కోతుల బెడద ఉన్నది వాస్తవమే. వీటిని పట్టించేందుకు మున్సిపల్‌లో తీర్మానం చేసి రూ.3 లక్షలు కేటాయించాం. కానీ కోతులు పట్టే వ్యక్తి దొరక్క ఇబ్బంది అవుతుంది. తొందరలో కోతులను పట్టించేందుకు చర్యలు తీసుకుంటాం. కుక్కలను సిద్దిపేట ఎనిమల్‌ వెల్ఫేర్‌ సొసైటీ వారు తీసుకుపోతున్నారు. పందులకు పట్టణ శివారులో ఆశ్రయం కల్పించే ఏర్పాట్లు చేయాలి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- టీ.మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌, హుస్నాబాద్‌


కోతులతో నరకం అనుభవిస్తున్నాం

ఓ వైపు ఉదయమే పక్షులు జొన్న కంకులపై వాలి విత్తులను ధ్వంసం చేస్తుండగా. మరోవైపు కోతులు జొన్న పంటను నాశనం చేస్తున్నాయి. వేకువజామునే చేలకు చేరుకుని వాటిని తరుముతున్నా.. కోతులు వందలాదిగా ఒకేసారి జొన్న కంకులను తెంపి సగం తింటూ సగం పడేస్తున్నాయి. పంట చేతికి అందే దశ వరకు ఎంత వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుని రైతులను కాపాడాలి.

- లైని ఏసేబు రైతు, మార్డి గ్రామం, కల్హేర్‌ మండలం


ఈ వార్తలు కూడా చదవండి:

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 12:06 PM