జనం ప్రాణాలతో జగన్ చెలగాటం!
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:59 AM
ప్రపంచానికి కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతిక మేధో సంపత్తిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్లలో ఇరవై లక్షలకు పైనే ఉద్యోగాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.......
ఆయన హయాంలో అతి భారీ మద్యం కుంభకోణం: సీఎం
నాసి మద్యానికి 30 వేల మంది బలైనట్లు నివేదిక
ఎక్సైజ్ శాఖను ఇప్పుడు ప్రక్షాళన చేశాం
ప్రపంచానికి ఏపీ నుంచి మేధోసంపత్తి అందిస్తాం
ఐదేళ్లలో 20 లక్షలకు పైనే ఉద్యోగాలిస్తాం
విశాఖకు అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ తెచ్చాం
ఆర్సెల్లార్ మిట్టల్, ఎన్‌టీపీసీ-నెడ్‌క్యా్‌ప వంటి బడా పారిశ్రామిక సంస్థలను తెచ్చాం
టాప్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి: సీఎం
మద్యం స్కాం 10 వేల కోట్ల పైమాటేనన్న స్పీకర్
లోతుగా దర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు హామీ
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతిక మేధో సంపత్తిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్లలో ఇరవై లక్షలకు పైనే ఉద్యోగాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే విశాఖకు 15 ట్రిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తోపాటు.. టీసీఎస్, ఆర్సెల్లార్ మిట్టల్, ఎన్‌టీపీసీ-నెడ్‌క్యా్‌ప వంటి భారీ ఐటీ, పారిశ్రామిక సంస్థలను తెచ్చామన్నారు. కేవలం 99 పైసలకే గ్లోబల్‌స్థాయిలో టాప్ 500 కంపెనీలకు భూములు ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చిందని సీఎం వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖలో అతి పెద్దకుంభకోణం చేశారని.. సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని.. దీనిపై క్యాబినెట్ ఉపసంఘాన్ని వేసి విచారణ చేపట్టామన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం సేవించి గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని అనారోగ్యంతో 30,000 మంది మృతి చెందినట్లు ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ఇప్పుడు ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశాం. దీనిని భరించలేని వైసీపీ నెగిటివ్ ప్రచారం చేస్తోంది’’ అని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాలు పారదర్శకంగా చేస్తోందన్నారు. అన్ని మద్యం బ్రాండ్లను అమ్ముతున్నామని చెపా ్పరు. ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం రూ.3,500 కోట్లకే పరిమితం కాదని.. దాదాపు రూ.10 వేల కోట్ల పైమాటేనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్యం, పరిశ్రమలు, టూరిజం, మౌలిక సదుపాయాల రంగాల అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందిస్తామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
వైసీపీ దుష్ప్రచారం..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు విముఖత చూపుతున్నట్లుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నంత కాలం పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు కచ్చితంగా క్యూ కడతారు. ఏపీ అంటే ఒక బ్రాండ్ అనేలా వారిలో విశ్వాసం కల్పించాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంటే.. మనకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని కొనసాగిస్తూనే.. ఒక కుటుంబం.. ఒక ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తి ఉండాలన్న నినాదం తీసుకొచ్చాం. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు రాష్ట్రం చిరునామాగా ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతిస్తున్నాం.
913 కంపెనీలు మూత..
2019-24 మధ్య కాలంలో అమర్‌రాజా, లులూ, ప్రాంక్లిన్ టెంపుల్టన్‌వంటి సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి వచ్చేది లేదని.. పెట్టుబడులు పెట్టేదే లేదంటూ ప్రతిజ్ఞచేశాయి. జగన్ ప్రభుత్వ కాలంలో 913 కంపెనీలు మూతపడ్డాయి.
పీపీపీ కాలేజీలు ప్రభుత్వ అధీనంలోనే..
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానం లో వైద్య కళాశాలలు నిర్మించడమంటే.. ప్రైవేటుపరం చేయడం కాదు. అవి ప్రభుత్వ అధీనంలోనే నడుస్తాయి. జగన్ హయాంలో కొన్ని మెడికల్ కాలేజీలకు భూములు కూడా కేటాయించలేదు.
పర్యాటకానికి పరిశ్రమ హోదా..
అతిథి దేవోభవ ఆంధ్ర విధానం.. మన సంస్కృతిలో భాగం. అందుకే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపులతో పాటు ప్రోత్సాహకాలూ అందిస్తున్నాం. పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు 102 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. వాటి ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 3.4 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 7,358 హోటల్ గదుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. గోవా తరహాలో సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తాం. గండికోటను మన దేశ గ్రాండ్ క్యానన్‌గా మారుస్తాం. ప్రసాద్ స్కీం కింద పలు దేవాలయాల అభివృద్ధి చేపడతాం. కారవాన్, హోమ్ స్టే, టెంట్ సిటీ వంటి కాన్పె్‌స్టల ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం.
యూనివర్సల్ వైద్య విధానం..
దేశంలో తొలిసారి యూనివర్సల్ వైద్య విధానం తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలందించేలా చర్యలు చేపడుతున్నాం. రూ.20 లక్షల దాకా ఆరోగ్య బీమా వర్తింపజేస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధంగా వైద్య సేవలు అందిస్తాం.
ఇంగ్లీష్ పేరిట విద్య విధ్వంసం
విద్యారంగంలో మరింత మెరుగైన ఫలితాల కోసం పేరెంట్, టీచర్, స్టూడెంట్ మీటింగ్‌లను తరచూ నిర్వహిస్తాం. గత పాలకులు ఆంగ్ల మాధ్యమం పేరిట విద్యావిధానాన్ని విధ్వంసం చేశారు. ప్రాథమిక విద్యలో మాతృభాష ద్వారానే విద్యాబోధన జరగాలని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు స్పష్టం చేశారు. కానీ ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీషు అంటూ.. రాష్ట్రంలోని బాలలకు మాతృభాష తెలుగులో అభ్యాసం లేకుండా చేశారు.