మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:49 AM
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ మరోసారి ముందుకొచ్చారు. దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటుడు, మానవతావాది సోనూసూద్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అండగా ఉంటానని ప్రకటించారు. ఆ ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తామని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు గగనతలాన్ని మూసివేయడం సహా విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. విమానాల రద్దు, దారి మళ్లింపులతో గంటల తరబడి నిరీక్షిస్తున్న ప్రయాణికుల కష్టాలను చూసి సోనూసూద్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారికి అండగా ఉంటానని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
మానవత్వానికి సరిహద్దులుండవు: సోనూ
'యుద్ధ పరిస్థితుల వల్ల దుబాయ్‌లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అక్కడ ఉండేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నవారికి మేము ఉచితంగా సురక్షిత వసతి కల్పిస్తాం. ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఎలాంటి షరతులు లేకుండా అందరికీ సాయమందిస్తాం' అని సోనూసూద్ తెలిపారు. బాధిత ప్రయాణికులు తమ తమ దేశాలకు చేరుకునేంత వరకూ ఉచిత వసతి సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మానవత్వానికి దేశ సరిహద్దులు, నిబంధనలేవీ ఉండవన్న ఆయన.. దుబాయ్‌లో ఆశ్రయం పొందేందుకు సాయం అవసరమైన వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు మెసేజ్ పంపాలని సూచించారు.
నెటిజన్ల ప్రశంసలు
సోనూసూద్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. చాలామంది నెటిజన్లు ఆయన మానవతా సేవలను ప్రశంసిస్తున్నారు. 'సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో' అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. కాగా.. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు చేర్చడంలో సోనూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు ఉచిత వసతి కల్పించేందుకు ముందుకు రావడంతో మరోసారి ఆయన సేవాభావం ప్రశంసలందుకుంటోంది.
ఇవీ చదవండి:
ఇరాన్ దాడుల వెనుక చైనా హస్తం ఉందా.?
ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్