ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:24 AM
ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నౌకాదళం భారత పోర్టులను వినియోగిస్తున్నదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు నిరాధారం, కల్పితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది.
అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. 'గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు' అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. 'భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. నిర్ధారణ లేని సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.
మధ్యప్రాచ్యంలో ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అన్ని దేశాలతో సమానంగా దౌత్య సంబంధాలను కొనసాగిస్తోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్‌తోనూ భారత్‌కు వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలున్నాయి. అందువల్ల భారత పోర్టులను యుద్ధ కార్యకలాపాలకు వినియోగించేందుకు అనుమతించడం వంటి చర్యలు భారత విదేశాంగ విధానానికి విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అమెరికా దాడులకు భారత్ సహకరిస్తోందన్న ప్రచారం అవాస్తవమని కేంద్రం స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది.
ఇవీ చదవండి:
ఇరాన్ దాడుల వెనుక చైనా హస్తం ఉందా.?
పర్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ?