ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ?
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:22 AM
ఇరాన్ కొత్త అత్యున్నత నేత (సుప్రీం లీడర్)గా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ తదితర వార్తాసంస్థలు బుధవారం వెల్లడించాయి.
వెల్లడించిన ఇరాన్ వార్తా సంస్థలు.. నిజం కాదన్న ఇరాన్ ప్రభుత్వం
ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా
టెహ్రాన్, జెరూసలేం, మార్చి 4: ఇరాన్ కొత్త అత్యున్నత నేత (సుప్రీం లీడర్)గా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ తదితర వార్తాసంస్థలు బుధవారం వెల్లడించాయి. అయితే, ఇది నిజం కాదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మొజ్తాబా. ఆయన వయస్సు 56 ఏళ్లు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. నిపుణుల అసెంబ్లీ మంగళవారం సమావేశమై.. కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎన్నుకున్నట్లుగా మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. దేశంలోని శక్తిమంతమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (ఐఆర్‌జీసీ) మద్దతు మొజ్తాబాకు ఉందని, ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాయి. అయితే, దీనిపై ముంబైలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ఇరాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నిపుణుల అసెంబ్లీ ఒక నాయకుడిని ఎన్నుకుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. కాగా, అయతుల్లా అలీ ఖమేనీ మీద జరిగిన దాడిలో మరణించిన పలువురిలో మొజ్తాబా భార్య జహ్రా కూడా ఉన్నారు.
ఎవరిని ఎన్నుకున్నా అంతమొందిస్తాం
ఇరాన్ కొత్త నేతగా ఎవరిని ఎన్నుకున్నా వారిని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కట్జ్ పేర్కొన్నారు. మొజ్తాబాను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. కట్జ్ బుధవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇజ్రాయెల్ వినాశనానికి ప్రణాళికలు అమలుపరిచేందుకు, అమెరికాను, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని, పశ్చిమాసియాలోని ఇతర దేశాలను బెదిరించేందుకు, ఇరాన్ ప్రజల్ని అణచివేసేందుకు ఇరాన్ ఉగ్రరాజ్యం ఏ నాయకుడిని నియమించినా అంతమొందిస్తాం. ఆ నాయకుడు ఎవరైనా, ఎక్కడా దాక్కున్నా పని పడతాం. ఈ మేరకు సైన్యానికి ప్రధాని నెతన్యాహు, నేను ఆదేశాలు ఇచ్చాం’ అని కట్జ్ తెలిపారు.