Share News

అమ్మో.. హైవే 65

ABN , Publish Date - Mar 05 , 2026 | 10:58 AM

సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.

అమ్మో.. హైవే 65

  • ఈ రహదారిపై ప్రయాణం ‘యమ’ డేంజర్‌

  • అతివేగంతో జీవితాలు చిత్తు

  • రోడ్డు భద్రతా నియమాలు పాటించని డ్రైవర్లు

  • ప్రమాద బాధితుల్లో యువకులే అధికం

సదాశివపేట సమీపంలో హైవే 65పై ఫిబ్రవరి 28న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ అతివేగం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ధ్రువీకరించారు.

అదే రోజు.. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద పటాన్‌చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో మరో కారు ట్రావెల్స్‌ బస్సును ఢీకొంది. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నిర్ధారించారు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌-ముంబయ్‌ హైవే కావడంతో వల్ల ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. హైదరాబాద్‌(Hyderabad) నుంచి షిర్డీ, ముంబయి, పూణేకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వెళ్తుంటాయి.


జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగానే ఉండటంతో భారీ వాహనాలు వేలాది సంఖ్యలో రాకపోకలు ఉంటాయి. నాలుగు లైన్లుగా ఉన్న ఈ రహదారిని ప్రస్తుతం ఆరు లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నారు. విస్తరణ పనుల కారణంగా రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు జరపడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. వాహనాల రద్దీ కారణంగా పటాన్‌చెరు నుంచి జహీరాబాద్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా వందలాది దాబాలు నిర్వహిస్తున్నారు. కొన్ని దాబాల్లో మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తుండటంతో డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు.


srd1.2.jpg

దీనికితోడు నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం సాగించాలని పోలీసులు పదేపదే చెబుతున్నా వాహనదారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. 2025లో జిల్లాలో 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మృతి చెందారు. 895 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 958 ప్రమాదాలు జరిగాయి. 433 మంది మృతిచెందగా 1011 మంది గాయపడ్డారు. 2023లో ప్రమాదాల సంఖ్య 827 కాగా, మృతులు 432, క్షతగాత్రులు 781 మంది. రోడ్డు ప్రమాద బాధితుల్లో యువకులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసుల గణాంకాల ద్వారా తెలుస్తోంది.

సంవత్సరం 2023 - 2024 - 2025

ప్రమాదాలు 827 - 958 - 917

మృతులు 432 - 433- 423

క్షతగాత్రులు 781 - 1011 - 895


ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అతివేగం, మద్యం సేవించడం, రాంగ్‌రూట్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించాం. ప్రమాదాలు నివారించేందుకు రోడ్డు భద్రత, నిబంధనలపై ప్రజలకు కల్పిస్తున్నాం. అవసరమైన చోట యుటర్న్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అవసరం లేని చోట మూసివేస్తున్నాం. తరచుగా వాహనాల తనిఖీ చేపడుతున్నాం. వాహనచోదకులు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి.

-పరితోష్‌ పంకజ్‌, సంగారెడ్డి ఎస్పీ


ఈ వార్తలు కూడా చదవండి:

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 10:58 AM