ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:14 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కవితకు కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో జాగృతి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని కొత్త....
పార్టీ, విధివిధానాల ప్రకటన.. జాగృతి శ్రేణులు భారీగా హాజరయ్యే విధంగా కార్యాచరణ
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కవితకు కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో జాగృతి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని కొత్త పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన దిశగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 24, 25తేదీల్లో ఆమె కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. జాగృతి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా మేడ్చల్ పరిధిలోని అద్వైత కన్వెన్షన్ సెంటర్‌ను ఆమె ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అద్వైతలోనా? లేదంటే ఏదైనా ఓపెన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకోవాలా? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా ఏప్రిల్ చివరివారంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని.. కొత్త పార్టీ, దాని విధివిధానాలను కవిత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కవిత గురువారం తిరుపతి వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళతారు.శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు.