Share News

సిగరెట్టు.. నకిలీ పొగబెట్టు..!

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:53 PM

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండల కేంద్రాల్లోనూ, మారుమూల గ్రామాల్లోని కిరాణా, పాన్‌షాపుల్లో ఈ నకిలీ సిగరెట్ల వ్యాపారం విస్తరించింది.

సిగరెట్టు.. నకిలీ పొగబెట్టు..!
Fake Cigarettes

  • జిల్లాలో జోరుగా నకిలీ సిగరెట్ల దందా

  • అసలు కంటే నకిలీపైనే వ్యాపారులకు భారీగా కమిషన్లు

  • రసాయనాలతో కూడిన పొగాకుతో ముంచుకొస్తున్న కేన్సర్‌ ముప్పు

  • తనిఖీలు చేపట్టని ఎక్సైజ్‌, పోలీసు శాఖ!!

కోహెడ(మెదక్): ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండల కేంద్రాల్లోనూ, మారుమూల గ్రామాల్లోని కిరాణా, పాన్‌షాపుల్లో ఈ నకిలీ సిగరెట్ల వ్యాపారం విస్తరించింది. ఎలాంటి బిల్లులు, రసీదులు లేకుండా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో యువత, కూలీలు వీటిని కొనుగోలు చేసి తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్యాకెట్ల ప్రింటింగ్‌లో తేడాలను గమనిస్తే ఈ నకిలీ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. డబ్బాపై ఉండే ప్రింటింగ్‌, బ్యాచ్‌ నంబర్‌, హెచ్చరిక బొమ్మల స్పష్టతలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీల పేర్లతో పోలిన నకిలీ డబ్బాలను తక్కువ ధరకు మార్కెట్లోకి తెస్తున్నారు. అసలు డబ్బా ధర రూ200 దాటి ఉంటే, నకిలీ డబ్బాను చాలా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు.


ఆశ చూపించే లాభాలు!

అసలు సిగరెట్‌ డబ్బా అమ్మితే వ్యాపారులకు రూ.10నుంచి రూ.15 మాత్రమే లాభం వస్తుంది. అదే నకిలీ డబ్బా విక్రయిస్తే ఏకంగా రూ.60 నుంచి రూ.80 వరకు మార్జిన్‌ లభిస్తోంది. దీంతో వ్యాపారులు ఎక్కువ లాభాల కోసం నకిలీ సిగరెట్లనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా స్థానిక యువత, కార్మికులు ఈ ప్రమాదకర అలవాటుకు బానిసలవుతున్నారు.


vv.jpgనకిలీతో క్యాన్సర్‌ ముప్పు మరింత ఎక్కువ

నకిలీ సిగరెట్లు యువత ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. స్టైల్‌ కోసమో, స్నేహితుల ఒత్తిడి వల్లో వీటిని తాగుతున్నప్పటికీ, సహజమైన పొగాకుకు బదులుగా హానికర రసాయనాలు కలిపిన పొగాకును వాడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ఊపిరితిత్తుల జబ్బులు, నోటి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వేగంగా సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.


నిమ్మకు నీరెత్తిన అధికారులు

జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా, ఎక్సైజ్‌, పోలీసు శాఖల తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించాలని, నకిలీ సిగరెట్ల సరఫరా ముఠాలను, తయారీదారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 01:55 PM