Share News

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:49 AM

బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అకారణంగా అరెస్ట్ చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao

సిద్దిపేట జిల్లా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ (CM Revanth Reddy Govt) అకారణంగా అరెస్ట్ చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఏం చేశారని సీఎం వస్తున్నారని ప్రశ్నించారు. ఆయనను నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (గురువారం) హరీశ్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సిద్దిపేటకు ఇంత భయంతో ఎందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారూ?’ అని నిలదీశారు.


సిద్దిపేటకు ఏం చేశారో సమాధానం చెప్పండి..

సిద్దిపేటలో ఎక్కడ చూసినా అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించి, వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. సిద్దిపేటకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మధ్యంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సిద్దిపేట కలెక్టరేట్ పక్కనే ఉన్న వెటర్నరీ కళాశాల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. కోమటి చెరువు పక్కన ఉన్న శిల్పారామం పనులు ఎందుకు నిలిచిపోయాయి? అని అడిగారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ మార్గంలో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన నర్సింగ్ కళాశాల పనులు ఎప్పుడు పూర్తవుతాయి? అని ప్రశ్నించారు.


అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు..

కేసీఆర్ హయాంలో నిర్మించిన రోడ్లపై కనీసం ప్యాచ్‌వర్క్ పనులు కూడా చేయలేని అసమర్థ పాలనకు కారణం ఏమిటి? అని హరీశ్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్దిపేట అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించింది?, ఎన్ని నిధులు ఖర్చు చేసిందో? ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను నిన్న (బుధవారం) అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరని, అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని హెచ్చరించారు.


ఈ సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం మానుకొని, సిద్దిపేట ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పట్టుబట్టారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలు వీరే..

1. కోనయ్యగారి ఎల్లం – నారాయణరావుపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు

2. కోనయ్యగారి సంతోశ్ – మాజీ వైస్ ఎంపీపీ

3. రెడ్డి యాదగిరి – బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు

4. దండు ప్రభాకర్ – మాజీ ఎంపీటీసీ

5. పడిగే ప్రశాంత్ ముదిరాజ్ – బీఆర్ఎస్వీ సిద్దిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 10:10 AM