ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45.5 ఎకరాల వ్యత్యాసం.. నివేదికపై సీఎం రేవంత్ ఆరా
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:17 AM
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325పై తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన భూసర్వే నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సర్వేలో మొత్తం 343 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
సిద్దిపేట, అక్టోబర్ 7: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325పై తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన భూసర్వే నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సర్వేలో మొత్తం 343 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. గత రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో 388.5 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదై ఉండగా, తాజా సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇంకా 45.5 ఎకరాల భూమి వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.
సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న పట్టా భూములపై కూడా అవసరమైతే సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసి, రికార్డులను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేసి, ఫాంహౌస్ పరిధిలో ఉన్న భూములను కూడా సర్వే చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ సరితతో పాటు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
సర్వే నంబర్ 325కు సంబంధించి పాత రికార్డుల్లో నమోదైన భూమి, ప్రస్తుతం సర్వేలో గుర్తించిన భూమి మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణాలు ఏమిటన్నది ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన భూమి వివరాలను రికార్డుల ఆధారంగా అధికారులు పరిశీలించనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
గోదావరి డెల్టా ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో డీపీఆర్: మంత్రి నిమ్మల
ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Read Latest AP News And Telugu News