గోదావరి డెల్టా ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో డీపీఆర్: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:59 AM
గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం రూ.13.4 కోట్లతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 7: గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం రూ.13.4 కోట్లతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుటికే ఈస్ట్రన్ డెల్టాకు రూ.1137 కోట్లతోనూ, సెంట్రల్ డెల్టాకు రూ.1268 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు చెప్పారు. త్వరలోనే గోదావరి వెస్ట్రన్ డెల్టా అంచనాలు కూడా సిద్ధం చేసి అందించాలని ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.
కాలువలు, డ్రైన్స్, బండ్ లెవల్, డీసిల్టింగ్, లాక్‌లు, షట్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిమ్మల సూచించారు. పూడుకుపోయిన సీ మౌత్‌ల వద్ద, డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గోదావరి దిగువన ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం వంటి ప్రాంతాలలో సముద్రంలో కలిసే డ్రెయిన్స్ పూడికపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించి, నేడు శిథిలావస్థకు చేరుకున్న లాక్‌లు, అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల మరమ్మత్తులు లేదా కొత్తవి నిర్మాణంపై దృష్టిపెట్టాలని చెప్పారు.
లైడార్ సర్వే చేసిన ఐఐఎస్‌సీ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే ముందు, స్థానిక నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధుల అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. డీపీఆర్‌లు సిద్ధం అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు ప్రయత్నం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా సీఈ, ఎస్‌ఈ, ఐఐఎస్‌సీ టెక్నాలజీస్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
మోదీకి చంద్రబాబు అభినందనలు.. 25 ఏళ్ల నాయకత్వంపై ప్రశంసలు
Read Latest AP News And Telugu News