ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమిస్తున్నాం
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:58 AM
ఎల్‌నినో ప్రభావంతో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
త్వరలో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎస్పీడీసీఎల్ సమీక్షలో మంత్రి గొట్టిపాటి
46 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
తిరుపతి సిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడడంతో విద్యుత్ కొరతతో కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామన్నారు. తిరుపతిలోని ఎస్సీడీసీఎల్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల నియామకాలను చేపడుతున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ‘రూఫ్ టాప్’ సోలార్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై కేవలం 6 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో లక్ష సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక విద్యుత్ పంపిణీ పథకం(ఆర్డీఎస్ఎస్) కింద విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!