Share News

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:07 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థులు మృతి చెందారు.

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి
Toxic Gas Leak

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాటర్ ట్యాంక్‌లోకి దిగిన విద్యార్థులు విషవాయువు కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.


వివరాల ప్రకారం.. బృందావన్‌లోని చైతన్య విహార్‌లో ఓ సంస్కృత పాఠశాల (గురుకులం) ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ శర్మ ఈ గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 200 మంది విద్యార్థులు చదువుతుండగా.. దాదాపు 100 మంది క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గురుకులంలోని భూగర్భ వాటర్‌ ట్యాంక్‌ నుంచి దుర్వాసన రావడాన్ని విద్యార్థులు గుర్తించారు. దీంతో ట్యాంక్‌ను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 12 నుంచి 14 అడుగుల లోతులో ఉన్న ట్యాంక్‌లోని నీటిని తొలుత మోటార్‌ సాయంతో బయటకు పంపించారు. అయితే కొంత నీరు మిగిలిపోవడంతో శుభ్రం చేసేందుకు ఓ విద్యార్థి ట్యాంక్‌లోకి దిగాడు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే విషవాయువు ప్రభావంతో అతడు స్పృహ కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్‌ చంద్ర ప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు.


అతడిని బయటకు తీసుకొచ్చేందుకు మరో నలుగురు విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా ట్యాంక్‌లోకి దిగారు. అయితే వారంతా విషవాయువును పీల్చడంతో స్పృహ కోల్పోయారు. మొత్తం ఐదుగురిని ట్యాంక్‌ నుంచి బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. రుద్ర అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన నలుగురు విద్యార్థుల వయసు 17 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని సమాచారం. మృతదేహాలను మార్చురీకి తరలించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


ఇవి కూడా చదవండి:

నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. సెలెక్టర్లు సాహసమే చేశారు: దినేశ్ కార్తీక్

టీ20ల్లో మెయిడెన్ సెంచరీ.. నా కల నిజమైంది: శ్రేయస్ అయ్యర్

Updated Date - Oct 07 , 2026 | 09:26 AM